కొంపలు కూల్చే బిగ్రోడ్.. నార్సింగిలో రాయలసీమ రియల్టర్‌తో కలిసి బిగ్ బ్రదర్ హల్చల్
నార్సింగి నుంచి కోకాపేట గోల్డెన్ మైల్ కాలనీ రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఆ రోడ్లను వంద అడుగుల విస్తీర్ణం చేయడంలో అర్థం ఉన్నది. కానీ ప్రశాంతంగా ఉన్న మా కాలనీలో రెండు వైపులా వంద అడుగుల రహదారులను మార్కింగ్ చేయడం వెనుక ఆంతర్యమేంది?
- మాస్టర్ ప్లాన్‌లోని వంద ఫీట్ల రహదారి అలైన్మెంట్ మార్పు
- భారీ భవంతులను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా అలైన్మెంట్
- దాదాపు వెయ్యి ఫ్లాట్లు ఉన్న పది అపార్టుమెంట్లకు రెడ్‌మార్క్
- భయాందోళనలో 2009లో నిర్మించిన ‘7హిల్స్’ బిల్డింగ్ వాసులు
- వంద ఫీట్ల రహదారి నిర్మాణంతో రోడ్డు మీదికి 850 ఫ్యామిలీలు
- గత అలైన్మెంట్ ఆధారంగా అపార్టుమెంట్లకు అనుమతులు, ఓసీలు
- ఇప్పుడు కొత్త అలైన్మెంట్తో ఇండ్లను టార్గెట్ చేసిన హెచ్ఎండీఏ
- పలువురు బడా బాబులకు భారీ ప్రయోజనం చేకూర్చేందుకు డీల్
- సొంత భూముల డెవలప్మెంట్ అగ్రిమెంట్లతో ఇతర భూములు కైవసం
- అలైన్‌మెంట్‌ను అనుసరించి ఉన్న సర్కార్ భూముల్లో హెచ్ఎండీఏ వేలం
- హెచ్ఎండీఏ అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరకు ప్లాట్లను కొట్టేసిన వైనం
- సుమారు రూ.250 కోట్ల ప్లాట్లు రూ.46 కోట్లకే కైవసం చేసుకున్న రియల్టర్
- సర్కార్ పెద్దల రియల్ వ్యాపారానికి మమ్మల్ని బలి చేస్తరా?: బాధితులు
కొంపలు మింగే ‘బిగ్’ అనకొండ.. ‘రహదారి ముసుగు’లో బుసలు కొడుతున్నది. అత్యంత విలువైన భూములున్న నార్సింగిలో మధ్యతరగతి ఇండ్లకు నాసు పెట్టింది. ఇష్టారీతిన మలుగుతూ పోతూ సామాన్యుల ప్లాట్లు స్వాహా చేసేందుకు కాచుకుకూర్చున్నది. ఓ రాయలసీమ రియల్టర్‌తో కలిసి బిగ్ బ్రదర్ సాగిస్తున్న ఈ అరాచక వేట.. వేలాది కుటుంబాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నది. అధికార యంత్రాంగం సైతం అండగా నిలువడంతో అడ్డొచ్చిన అపార్టుమెంటుకల్లా రెడ్‌మార్క్ వేసి కూలదోసే కుట్రకు తెరలేచింది. ఖరీదైన భూములను డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద రాయించుకొని, వాటికనుగుణంగా అలైన్మెంట్ మార్చి వేల కోట్ల రియల్ దందా నడిపేందుకు ‘దారి’పడుతున్నది.
రద్దీ రోడ్లను వదిలి.. మా కాలనీ రోడ్లు ఎందుకు?
నార్సింగి నుంచి కోకాపేట గోల్డెన్ మైల్ కాలనీ రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఆ రోడ్లను వంద అడుగుల విస్తీర్ణం చేయడంలో అర్థం ఉన్నది.

కానీ ప్రశాంతంగా ఉన్న మా కాలనీలో రెండు వైపులా వంద అడుగుల రహదారులను మార్కింగ్ చేయడం వెనుక ఆంతర్యమేంది? కేవలం ఓ రియల్టర్ తెరవెనుక ఉండి నడుపుతున్న వ్యవహారంలో హెచ్ఎండీఏ అధికారులు పావులుగా మారి మాస్టర్ప్లాన్నే మార్చుతున్నరు. ఇండ్లమీదికి బుల్డోజర్లను పంపుతున్నారు.
– అనంత శర్మ, వెస్ట్రన్ మీడోస్ కాలనీ
ప్రజాస్వామ్యమా? రాచరికమా?
అలైన్మెంట్ ఎందుకు మార్చారో చెప్పలేదు. మా అభిప్రాయం అసలే తీసుకోలేదు. ఈ మార్పులతో ఎవరికి లాభం జరుగుతుంది? మాకు ఎంత నష్టం జరుగుతుంది?? అనే విషయాలపై పట్టింపు అసలే లేదు. ఆగమేఘాలపై జీవోలు ఇవ్వడమే కాకుండా, మార్కింగులు కూడా వేశారు.

ఇదంతా చూస్తుంటే, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతున్నది. ఏదేమైనా మా ఇండ్లను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తం.
-లక్ష్మి, సెవెన్‌హిల్స్ నివాసి

గుండాల కృష్ణ, దుద్దాల రాజు
హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : సామాన్యుల కొంపలు కూల్చే కాంగ్రెస్ సర్కార్ మార్క్ ‘బుల్డోజర్‌రాజ్’ పాలన ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నది. హైడ్రా, మూసీ, 22ఏ నిషేధిత జాబితా తదితర పేర్లతో గత రెండున్నరేండ్లకు పైగా నిత్యం ఏదో ఒక బూచీని చూపి ప్రశాంతంగా ఉన్న పేదోళ్ల ఇండ్లల్లో చిచ్చు పెడుతున్న రేవంత్ ప్రభుత్వం తాజాగా అత్యంత విలువైన భూములు ఉన్న నార్సింగిలోని మధ్యతరగతి ఇండ్లల్లో కార్చిచ్చు రేపింది. వంద ఫీట్ల రహదారి అలైన్మెంట్ మార్పుతో ఏకంగా వెయ్యికి పైగా సామాన్యుల ఫ్లాట్లను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది.
హెచ్ఎండీఏను కీలుబొమ్మగా మార్చి… ఓ రాయలసీమ రియల్డర్తో బిగ్ బ్రదర్ సాగిస్తున్న ఈ అరాచకం వేల కుటుంబాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నది. 2013 మాస్టర్‌ప్లాన్‌లో రూపొందించిన వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మారుస్తూ రాత్రికి రాత్రి అధికారిక గెజిట్లను జారీ చేస్తున్నారు. ఖరీదైన భూములను డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద రా యించుకొని వాటికి అనుగుణంగా అలైన్‌మెంట్‌ను మార్చి వేల కోట్ల రియల్ వ్యాపారానికి బిగ్ బ్రదర్ తెర లేపుతున్నారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న అపార్టుమెంట్లకు రెడ్‌మార్క్ వేసి కూల్చివేసేందుకు సైతం వెనుకాడటం లేదు.
రాత్రికి రాత్రి హెచ్ఎండీఏ వేలం నిర్వహించి అలైన్మెంట్ పొడవునా ఉన్న ప్రభుత్వ భూములను ప్లాట్ల రూపంలో అగ్గువకు చేజిక్కించుకొన్నారు. ప్రజా ప్రయోజనార్ధం ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూపొందించాల్సిన రహదారులను తెర వెనుక సర్కార్ పెద్దల ఆదేశాలకు తలూపి హెచ్ఎండీఏ అధికారులు ఈ ‘బిగ్’ భూదాహానికి ఆజ్యం పోస్తున్నారు. 13 ఏండ్ల కిందట ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను మార్చిన విధానం… కొత్త అలైన్మెంట్తో కొంపలు కూల్చేందుకు అపార్టుమెంట్లకు మార్కింగ్ చేసిన తీరు… అంతకుమించి వేల కోట్ల రియల్ వ్యాపారానికి వేసుకున్న పునాదులను పరిశీలిస్తే అసలు సామాన్యుడు తమ ఆస్తులను కాపాడుకోవడమనేది మృగ్యమయ్యిందని సుస్పష్టమవుతున్నది.
ట్విస్ట్-1
2013లో అలా మొదలైంది..!
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఐదు జిల్లాలు, 55 మండలాలతో హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ను అధికారికంగా జారీ చేసింది. అప్పటివరకు ఉన్న జీహెచ్ఎంసీ, హుడా, కంటోన్మెంట్, సైబరాబాద్ (సీడీఏ), ఎయిర్‌పోర్టు (ఏడీఏ) అన్నింటినీ కలిపి 7,228 పైగా చదరపు కిలోమీటర్ల పరిధిలో భూముల వినియోగం, నీటి వనరులు, రహదారులు ఇలా అన్ని కోణాల్లో ప్రణాళికల్ని ఇందులో పొందుపరిచారు.
భవిష్యత్తులో చేపట్టే రహదారుల ప్రణాళికను కూడా సూచించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి గ్రామ పరిధిలో వంద ఫీట్ల రోడ్డు మాస్టర్‌ప్లాన్‌ను కూడా స్పష్టంగా పొందుపరిచారు. నార్సింగి గ్రామ పరిధిలోని సర్వేనెంబర్లు 94, 95, 96, 102, 103, 114, 116, 121, 122, 124, 126, 478 (మంచిరేవుల) మీదుగా వంద ఫీట్ల రహదారిని ప్రతిపాదించారు. ఈ క్రమంలో అలేఖ్య టవర్స్ నుంచి సర్వేనెంబరు 102, 133 వరకు నేరుగా వచ్చే వంద ఫీట్ల రహదారి అక్కడ మలుపు తిరిగి చివరికి సర్వేనెంబరు 126 మీదుగా మంచిరేవుల సర్వేనెంబరు 478 నుంచి నార్సింగి-శంకర్పల్లి ప్రధాన రహదారికి అనుసంధానమవుతుంది. దీని ద్వారా భవిష్యత్తులో భారీ ఎత్తున ట్రాఫిక్ మళ్లింపు జరిగి రద్దీకి చెక్ పెట్టినట్లవుతుందనే ఉద్దేశంతో ఈ అలైన్మెంట్ రూపొందించి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. తదనంతరం మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే అనుమతులు ఇచ్చుకుంటూ పోయారు. ఇందుకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌లోని వంద ఫీట్ల రహదారి పొడువునా అనేక భారీ అపార్టుమెంట్లు వచ్చాయి.

పోర్టికోకు రెడ్‌మార్క్
సర్వేనెంబరు 102, 116లో నిర్మించిన పోర్టికో అపార్టుమెంటును 2,625 చదరపు గజాల్లో నిర్మించారు. ఇంత భారీ అపార్టుమెంటులో 29 ఫ్లాట్లు ఉన్నాయి. తాజా అలైన్మెంట్ ప్రకారం, అధికారులు రెడ్‌మార్కు ఆధారంగా ఏకంగా 23 ఫ్లాట్లు ధ్వంసం కానున్నాయి. ఈ నిర్మాణానికి కూడా హెచ్ఎండీఏ అనుమతులు ఇవ్వడంతో పాటు ఈ ఏడాదిలోనే నిర్మాణం పూర్తవడంతో ఓసీ కూడా జారీ చేసింది.
ట్విస్ట్-2
చారిత్రక ఆలయాన్ని కాపాడటం కోసం..
బీఆర్ఎస్ హయాంలోనూ ఈ అలైన్‌మెంట్‌కు అనుగుణంగా అనుమతులు ఇచ్చారు. అయితే సర్వేనెంబరు 126లోని పెద్ద గుట్టపై 400 ఏండ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయం ఉంది. 2013 అలైన్మెంట్ ప్రకారం.. ఈ గుట్ట మధ్యలో నుంచి ఆలయం మీదుగా రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. దీంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి.
ఆలయాన్ని కాపాడాలంటూ స్థానికులు పలుమార్లు అప్పటి ప్రభుత్వానికి వినతులు ఇవ్వడంతో ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి కేసీఆర్ ప్రభుత్వం అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేస్తూ 2018లో గెజిట్ జారీ చేసింది. పాత అలైన్మెంట్లో కేవలం సర్వేనెంబరు 126లోని గుట్ట మధ్యలో నుంచి రహదారి కాకుండా ఆ సర్వేనెంబరులోకి ప్రవేశించిన రోడ్డును కుడివైపు మలిపి నార్సింగ్ సర్వేనెంబర్లు 127, 129 నుంచి నేరుగా కోకాపేట ప్రధాన రహదారికి అనుసంధానించేలా మార్పు చేశారు. ఈ మేరకు 2018 అక్టోబర్ 22న గెజిట్ నంబర్ 296 జారీ చేశారు.

‘30 మీటర్ల (వంద ఫీట్లు) రహదారి మంచిరేవుల సర్వేనెంబరు 478, నార్సింగ్ సర్వేనెంబరు 126 మీదుగా వెళ్లడం వల్ల 400 సంవత్సరాల చారిత్రక ఆలయానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ భాగాన్ని తొలగిస్తూ… వంద ఫీట్ల రహదారి.. సర్వేనెంబరు 126, 127, 129లో ఇప్పటికే ఉన్న 18 మీటర్లు (60 ఫీట్ల) రహదారి మీదుగా వెళుతుంది’ అని గెజిట్‌లో స్పష్టం చేశారు. అంటే వంద ఫీట్ల రహదారి సర్వేనెంబరు 126లోకి రాగానే.. అప్పటికే ఉన్న 60 ఫీట్ల రహదారి మీదుగా వెళుతుందంటే.. ఆ రోడ్డును విస్తరిస్తారన్న మాట. కాగా ఈ స్వల్ప మార్పు వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఎలాంటి కూల్చివేతలూ జరుగలేదు.
ట్విస్ట్-3
ఇష్టానుసారంగా అలైన్మెంట్లో మార్పు
400 ఏండ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయాన్ని కాపాడాలంటూ స్థానికులు చేసిన విజ్ఞప్తి మేరకు 2013 నాటి అలైన్మెంట్లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం స్వల్పంగా మార్పులు చేసింది. అయితే, ఇప్పుడు రేవంత్ హయాంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరు అభ్యంతరం పెట్టారో తెలియదు.. ఎందుకు చేస్తున్నారో అసలే తెలియదు గానీ, ఉన్నపళంగా మరోసారి భారీయెత్తున అలైన్‌మెంట్‌ను మారుస్తూ ఈ ఏడాది జనవరి ఏడో తేదీన గుట్టుచప్పుడు కాకుండా అధికారులు గెజిట్ జారీ చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో ఏదైనా రహదారి అలైన్మెంట్ మార్చాలంటే అందుకు సహేతుకమైన కారణాలుండాలి.
అలైన్మెంట్ మార్చాలంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాలి. లేదా చారిత్రక, వారసత్వ సంపదకు ఇబ్బంది కలుగడం వంటి కారణాలు ఉండాలి. లేదా పట్టణీకరణ దరిమిలా వచ్చిన మార్పులతో తాజా పరిస్థితులకు అనుగుణంగా అనివార్యత ఏర్పడినట్టు నిపుణులు రిపోర్టు ఇవ్వాలి. ఇలాంటి కారణాలుంటే సంబంధిత వర్గాల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించిన తర్వాత హెచ్ఎండీఏ అధికారులు అలైన్మెంట్లో మార్పు చేయాలి. కానీ అలేఖ్య టవర్స్ నుంచి సర్వేనెంబరు 129 వరకు ఉన్న అలైన్‌మెంట్‌ను ఉన్నపళంగా మార్చడంలో ఆంతర్యమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా పాత అలైన్మెంట్ ప్రకారం అనేక అపార్టుమెంట్లకు గతంలో ఇదే హెచ్ఎండీఏ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఎన్వోసీలు సైతం జారీ చేశారు. కానీ ఇప్పుడు అలైన్‌మెంట్‌ను మారుస్తూ గెజిట్ జారీ చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 60 ఫీట్ల రహదారులు ఎన్నెన్నో ఉన్నాయి. పైగా అక్కడ ఉన్న భూముల్లో 20-30 శాతం మేర నిర్మాణాలు జరిగాయి. అయినప్పటికీ ఆ నిర్మాణాలను కూల్చేలా పాత అలైన్‌మెంట్‌ను మార్చడమంటే తెర వెనక భారీ రియల్ కుట్రలు దాగి ఉన్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.
ట్విస్ట్-4
అలైన్మెంట్లో మార్పు ఎలా చేశారంటే…
- గతంలో నార్సింగి సర్వే నెంబరు 94, 95లో మొదలై 103 సర్వేనెంబరు వరకు వెళ్లిన తర్వాత ఎడమ వైపునకు తిరిగి నేరుగా ముందుకు వెళ్లేది.
- తాజాగా సర్వేనెంబరులో 96లో మొదలై 102 సర్వేనెంబరులోకి మార్చారు. అంటే ఇక్కడ సర్వేనెంబర్లు 94, 95, 103, 110, 114ను తప్పించారు. కొత్తగా ఈ మార్గంలో 108 సర్వే నెంబరులోకి రహదారిని మార్చారు.
- పాత అలైన్మెంట్లో 124 తర్వాత 126లోకి ప్రవేశించి కుడి వైపునకు మళ్లి అక్కడ సర్వేనెంబరు 127, 129ల మీదుగా కోకాపేట ప్రధాన రహదారికి కలిసేది.
- కానీ కొత్త అలైన్మెంట్లో 102 నుంచి 123, 124లోకి తీసుకుపోయారు. తద్వారా పాత అలైన్మెంట్లో ఉన్న సర్వే నెంబరు 122ను తప్పించారు. సర్వే నెంబరు 126ను పూర్తిగా తొలగించారు.
- గతంలో నేరుగా ఉన్న అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మార్చారనేందుకు ఇంకా అనేకమైన ఆధారాలున్నాయి. సర్వే నెంబరు 124 వరకు మాత్రమే కొత్త అలైన్‌మెంట్‌ను పరిమితం చేసి మధ్యలో రెండు చోట్ల కొత్త అలైన్మెంట్లను రూపొందించారు.
- సర్వేనెంబరు 102లోకి ప్రవేశించిన తర్వాత నేరుగా తీసుకుపోవడంతో పాటు కుడి వైపునకు మలిపి 114, 115, 116 సర్వేనెంబర్లలో నుంచి 108లోకి తీసుకుపోయి అక్కడి నుంచి సర్వేనెంబరు 169 మీదుగా కోకాపేట ప్రధాన రహదారికి కలిపారు. తద్వారా కొత్తగా 108, 115, 118, 169 సర్వే నెంబర్లలో నుంచి వంద ఫీట్ల రహదారిని రూపొందించారు. దీంతో ఇక్కడే పలు అపార్టుమెంట్లు అడ్డంగా కోతకు గురవుతున్నాయి.
- అదేవిధంగా సర్వే నెంబరు 124లోకి వెళ్లిన తర్వాత రహదారి మరోసారి కుడి వైపునకు తిప్పారు. అక్కడి నుంచి 121, 120, 119లో నుంచి 168, 167లోకి పోయి కోకాపేట ప్రధాన రహదారికి అనుసంధానించినట్టు సమాచారం. దీంతో 2008లో నిర్మించిన 7హిల్స్ అపార్టుమెంటు రెండువైపులా కోతకు గురై భారీ ఎత్తున సామాన్యుల ఫ్లాట్లు కూల్చివేతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది.
ట్విస్ట్-5
విలువైన భూములపై రియల్టర్ రాడార్
ఈ అలైన్మెంట్ మార్పులు ఉన్నపళంగా ఎందుకు జరిగాయో లోతుగా విశ్లేషిస్తే, పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. రాయలసీమకు చెందిన ఓ రియల్టర్ వెస్ట్‌జోన్ పరిధిలో చాలా సంవత్సరాలుగా రియల్ వ్యాపారం చేస్తున్నారు. అందులో భాగంగా నార్సింగిలోనూ ఇదే వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ను అనుసరించి ఉన్న భూముల్లోనూ భారీ లేఅవుట్స్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
ఇవే కాదు… ఆ చుట్టుపక్కల విలువైన భూములపై నిత్యం సదరు రియల్టర్ రాడార్ కొనసాగుతుందనేది అక్కడ బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిగ్ బ్రదర్ ఒకరితో రియల్టర్‌కు సంబంధాలు బలపడుతూ వచ్చాయి. గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ మంచిరేవులలోని వేణుగోపాలస్వామి ఆలయ భూములకు సంబంధించిన రహదారి నిర్మాణ స్కామ్‌లో సీఎం సోదరులు ఉన్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బిగ్ బ్రదర్స్ వంద ఫీట్ల రహదారిని రూపొందించిన ఎపిసోడ్‌లోనూ సదరు రియల్టర్ పాత్ర ఉన్నట్లు తెలిసింది. తనకు సంబంధించిన భూములకు మంచి డిమాండ్ వచ్చేలా ఆ వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ను మార్చారని, అంతేగాకుండా ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉన్న వందెకరాల ప్రభుత్వ భూమికి ప్రయోజనం చేకూరేలా ఈ అలైన్మెంట్ మార్చగా, ఆ భూమిని గతంలోనే కొనుగోలు చేసి, న్యాయపరంగా కోర్టులో కేసును కొనసాగిస్తున్నది కూడా ఈ రియల్టరేనని తెలిసింది. ఇవేకాకుండా అనేక భూ వ్యవహారాల్లోనూ బిగ్ బ్రదర్స్‌తో ఈ రియల్టర్ భాగమయ్యారని వెస్ట్‌జోన్ రియల్ రంగంలో బహిరంగ రహస్యమే. ఈ పరంపరలోనే బిగ్ బ్రదర్స్‌తో కలిసి ఆ రియల్టర్ 2013లో జారీ చేసిన వం ద ఫీట్ల అలైన్‌మెంట్‌ను తాజాగా మార్చినట్లుగా తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి పలు ఆధారాలు కూడా అం దుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ట్విస్ట్-6
తెర వెనుక బిగ్ బ్రదర్ అండ్ కో
మాస్టర్‌ప్లాన్‌లోని వంద ఫీట్ల రహదారి అలైన్‌మెంట్‌ను మార్చడంలో బిగ్ బ్రదర్ అండ్ కో తెర వెనుక భారీ మథనమే చేసినట్లు స్పష్టమవుతుంది. ఇందులో పెద్ద ఎత్తున రియల్ మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్లు తెలిసింది. పాత అలైన్‌మెంట్‌లోని సర్వే నెంబర్లను తప్పించేందుకు తెర వెనుక భారీ డీల్స్ జరిగాయనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు అందులో కొన్ని భూములను డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం, కొత్త అలైన్‌మెంట్‌ను అనుసరించి ఉన్న భూములను సైతం డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకున్నట్లు తెలిసింది. ఉదాహరణకు..
- సర్వేనెంబరు 106లో ఓ మాజీ మేయర్‌కు చెందిన సుమారు 8 వేల చదరపు గజాల విస్తీర్ణంలో దాదాపు 20 ప్లాట్లు ఉన్నాయి. వీటిని సదరు రియల్టర్ కుమారుడు, సమీప బంధువుల పేరిట నిర్మాణ సంస్థలు ముందుగానే డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకున్నాయి. కొత్త అలైన్మెంట్తో ఆ భూముల ముందు వంద ఫీట్ల రహదారి వచ్చి భారీగా డిమాండు పెరిగింది.
- సర్వేనెంబరు 126లో సదరు రియల్టర్‌కు చెందిన ఎకరం భూమి ఉన్నట్లు తెలిసింది. అందుకే కొత్త అలైన్మెంట్లో పూర్తిగా ఆ రూటును తొలగించారు.
- సర్వేనెంబరు 129లో కూడా సదరు బిల్డర్‌కు చెందిన భూమి ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ రూటును కూడా తొలగించారు.

ట్విస్ట్-7
అగ్గువకు హెచ్ఎండీఏ ప్లాట్లు
నానాటికీ విస్తరించే హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేలా మౌలిక వసతుల కల్పన, ప్రణాళికాబద్దమైన అభివృద్ధి వంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ గత రెండున్నర సంవత్సరాలుగా బిగ్ బ్రదర్స్ ఆస్థానంగా మారి పోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలను మరచిపోయిన అధికారులు.. సర్కార్ పెద్దల సేవలో తరించిపోతున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ అనేకచోట్ల పెద్దల ఇష్టానుసారంగా మాస్టర్‌ప్లాన్‌లోని వంద ఫీట్ల రహదారుల అలైన్మెంట్లను లింకు రోడ్ల పేరిట మారుస్తున్నారు. తద్వారా సంస్థ పరువును దిగజారుస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి… ఈసారి స్వామిభక్తిని చాటుకొని సంస్థ ప్రతిష్ఠను మరింతగా బజారుకీడ్చారు. సాధారణంగా హెచ్ఎండీఏ నిర్వహించే ప్లాట్ల వేలంలో ధర బాగా పలికిన సందర్భాలు అనేకం. ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో ప్లాట్లు హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోతాయి. ఈ క్రమంలో నార్సింగి పరిధిలో ఎకరం కనీసంగా రూ.100-150 కోట్ల వరకు ధర పలుకుతుంది. కానీ బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో నిర్వహించిన హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంలో రియల్టర్‌కు చెందిన సమీప బంధువు పేరుతో కొత్త నిర్మాణ కంపెనీని ఏర్పాటు చేసి ఆ రెండు భారీ ప్లాట్లను అగ్గువకే కొల్లగొట్టారు.
ట్విస్ట్-8
110 కోట్ల భూమి రూ. 26 కోట్లకే
సర్వే నెంబరు 103లో 1.07 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వంద ఫీట్ల పాత అలైన్మెంట్ ప్రకారం ఈ భూమితో రహదారికి ఏమీ సంబంధం ఉండదు. పైగా ఈ భూమిని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించింది. కానీ ఈ బిగ్ అరాచకంలో భాగంగా ఆ కేటాయింపును రద్దు చేయించారు.
వంద ఫీట్ల రహదారికి పోగా మిగిలిన 2,420 చదరపు గజాలను ఈ ఏడాది ఆగస్టులో హెచ్ఎండీఏ వేలం వేసింది. కనీస ధర చదరపు గజానికి రూ.75 వేలుగా నిర్ధారించింది. ఇక్కడ చదరపు గజం రూ.1.50 లక్షల నుంచి రెండు లక్షల వరకు ఉండగా అర్బన్ మాన్సన్స్ ఎల్ఎల్పీ అనే కంపెనీ రూ.80 వేల కోట్ చేసి బిడ్ దక్కించుకుంది. అంటే రూ.40-50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19.36 కోట్లకు దక్కించుకున్నారు. పైగా ముందు వంద ఫీట్ల రహదారి అదనం. దీంతో ఆ భూముల ధరలకు రెక్కలొచ్చినట్లయ్యింది. అలాగే, సర్వేనెంబరు 105లోనూ 1.17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి ముందు నుంచి వెళ్లేలా కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందించారు. తర్వాత హెచ్ఎండీఏ 5,687 చదరపు గజాలకు వేలం నిర్వహించగా… అదే అర్బన్ మాన్సన్స్ ఎల్ఎల్పీ చదరపు గజం కేవలం రూ.47వేలకే దక్కించుకుంది. అంటే ఇక్కడ రూ.85-110 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.26.72 కోట్లకు దక్కించుకున్నారు. అయితే ఈ వేలం ఎప్పుడు నిర్వహించారు? కనీస ధర ఎంత అనేది ప్లాటు కేటాయింపు ఉత్తర్వుల్లోనూ లేకపోవడం గమనార్హం.

ఫుట్ ప్రింట్స్ పాఠశాలకు ఎసరు
సర్వేనెంబరు 102లో రెండేండ్ల కిందట 500 చదరపు గజాల్లో నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఫుట్ ప్రింట్స్ పాఠశాల కొనసాగుతున్నది. ఐదంతస్తుల భవనానికి హెచ్ఎండీఏనే అనుమతి, ఓసీ ఇచ్చింది. తాజా అలైన్మెంట్తో 75 ఫీట్ల పొడవున్న ఈ భవనం ముందుభాగంలో 20 ఫీట్ల మేర ధ్వంసం కానున్నది.
ట్విస్ట్-9
13 కంపెనీలకు ఒకటే చిరునామా
వాస్తవానికి వేలంకు ముందు ఈ ప్లాట్లను చదును చేసి, రోడ్డును చూపిస్తే బిడ్డర్లు ముందుగా వచ్చి చూసుకొని వేలంలో పోటీపడతారు. కానీ నిన్నటిదాకా ఈ భూములన్నీ చెట్లు, పొదలతోనే ఉన్నాయి. హెచ్ఎండీఏ వేలం, ప్లాట్ల కేటాయింపు తర్వాత సదరు కంపెనీ యాజమాన్యం వచ్చి భూమిని చదును చేశారు.
పైగా బిడ్ మొత్తం పూర్తిగా చెల్లించారా? లేదా? అనే దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హెచ్ఎండీఏ వేలం గుట్టుగా నిర్వహించడంతో పాటు ఆన్లైన్లో మతలబు చేశారనే ఆరోపణలున్నాయి. ఎందుకంటే… రెండుచోట్ల భూమిని దక్కించుకున్న అర్బన్ మాన్సన్స్ ఎల్ఎల్పీ చిరునామా మంచిరేవులలోని డ్యూస్ విల్లా నెంబరు ఎ9గా ఉంది. ఈ విల్లా ప్రాజెక్టు సదరు రియల్టర్ సొంత ప్రాజెక్టు. అంతేకాదు… ఇదే చిరునామాపై దాదాపు పదమూడు కంపెనీలు నమోదై ఉన్నాయంటే ఎంత పకడ్బందీగా తమ భూ దాహాన్ని తీర్చుకుంటున్నారో అర్థమవుతుంది. అయితే కొత్త అలైన్మెంట్ కుట్రలో భాగంగా పలువురు భూములను డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకొన్నారు. మరికొన్ని భూముల్లో ఆకాశహర్మాల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, ఈ అనుమతులకు విజ్ఞప్తి చేసిన కంపెనీలన్నీ ఈ పదమూడులోనే ఉండటం గమనార్హం. కాగా ఈ ప్లాట్లలో అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి కూడా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

చదరపు గజం రూ. 80 వేలకే కోట్ చేసి.. రూ.40-50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19.36 కోట్లకే దక్కించుకొన్న అర్బన్ మాన్సన్స్ ఎల్ఎల్పీ కంపెనీ
ట్విస్ట్-10
మరుసటి రోజే రెండో గెజిట్ జారీ…
హైదరాబాద్ మహా నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. చివరకు మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల భూసేకరణ సైతం మూడేండ్లుగా నత్తనడకన కొనసాగుతున్నది. కానీ ఇక్కడ మాత్రం హెచ్ఎండీఏ ఆగమేఘాల మీద పని చేస్తున్నది.
వంద ఫీట్ల రహదారి అలైన్మెంట్ మార్చడమే తరువాయి… ఆ గెజిట్ ఇచ్చిన మరుసటి రోజే అంటే ఈ ఏడాది జనవరి 8న రెండో గెజిట్ జారీ చేసింది. నార్సింగి పరిధిలో కొత్త అలైన్మెంట్ ప్రకారం 17 సర్వేనెంబర్లలో 15,50,365 చదరపు గజాలు అంటే 3.82 ఎకరాల భూమి రహదారి విస్తరణలో సేకరించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయం లేదు… ట్రాఫిక్ అవసరాలు అంతకన్నా లేవు… చివరకు అక్కడ భవిష్యత్తు ప్రణాళికలున్నాయంటే గత మాస్టర్‌ప్లాన్‌లో వంద ఫీట్ల రహదారి ఉంది. అయినప్పటికీ హెచ్ఎండీఏ అధికారులు దుర్మార్గంగా బిగ్ బ్రదర్స్ రియల్ ప్రయోజనాల కోసం సామాన్యులకు చెందిన విలువైన ఆస్తుల్ని ధ్వంసం చేసేందుకు అధికారాన్ని వినియోగించడం విమర్శలకు దారి తీస్తున్నది.
రోడ్డుమీదికి 850 ఫ్యామిలీలు
ఈ మొత్తం బిగ్ భూ దాహంలో అత్యంత కీలకమైన, దయనీయమైన పరిస్థితి ‘7హిల్స్ అపార్టుమెంట్స్’ది. 2009లో అన్నిరకాల అనుమతులతో ఏకంగా ఏడున్నర ఎకరాల్లో పద్నాలుగు అంతస్తుల చొప్పున అనేక బ్లాకులు నిర్మించారు. ఇందులో ఏకంగా 850 ఫ్లాట్లు ఉన్నాయి. అంటే 850 కుటుంబాలు సుమారు 17 సంవత్సరాలుగా అక్కడ ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్త అలైన్మెంట్తో 7హిల్స్ అపార్టుమెంటు ముందు, వెనుక భాగాలు రెండూ దెబ్బతింటున్నాయి. సుమారు రెండు వేల చదరపు గజాల వరకు వంద ఫీట్ల రహదారికి ఇవ్వాల్సి వస్తుందని అధికారులు వేసిన మార్కింగ్ ద్వారా అపార్టుమెంటువాసులు అంచనా వేస్తున్నారు.

డబుల్ సెల్లార్‌తో పాటు ఆ నిర్మాణ సముదాయంలోని ఆలయాలు, పార్కింగ్లోని లిఫ్టులు, జనరేటర్ రూంలు, నీళ్ల సంపులు, పార్కింగ్, కారిడార్లు, ర్యాంపులు అన్నీ ధ్వంసం కానున్నాయి. అయితే సాంకేతికంగా రెండువేల చదరపు గజాలే అయినప్పటికీ అందులో అపార్టుమెంట్ల పిల్లర్లు, భీంలు వస్తుండటంతో మొత్తం బ్లాకుల నిర్మాణాలే దెబ్బతినే ముప్పు పొంచి ఉందని 7హిల్స్ అపార్టుమెంటువాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మార్కింగ్ వేసినప్పటి నుంచి ఆందోళన చెందుతూ… చివరకు రెండు బస్సుల్లో హెచ్ఎండీఏ కార్యాలయానికి కూడా వెళ్లి తమ మొర వినిపించారు.

అలెగ్జాండర్ భవంతి ఆగమాగం : సర్వేనెంబరు 116లో అలెగ్జాండర్ రెడ్డి అనే వ్యక్తి ఈ భవనాన్ని నిర్మించుకున్నారు. అన్ని అనుమతులతో నిర్మించిన ఈ భవనానికి హెచ్ఎండీఏ ఓసీ కూడా ఇచ్చింది. ఇప్పుడు కూలుస్తానంటున్నారు.

స్కూల్‌నూ వదలట్లేదు : సర్వేనంబరు 124లోని ఈ భవనంలో మాంటిస్సోరి పాఠశాల కొనసాగుతున్నది. అన్ని అనుమతులు ఉన్నా.. ఈ బిల్డింగ్‌ను కూల్చబోతున్నారు.

గీతం ఒనిక్స్ గగ్గోలు : సర్వేనంబరు 102లోనే రెండేండ్ల కిందట నిర్మించిన ఐదంతస్తుల గీతం ఒనిక్స్ అపార్టుమెంటు సైతం తాజా అలైన్మెంట్తో ధ్వంసం కానున్నది.

నిర్మాణం పూర్తికాకముందే మరణశాసనం : సర్వేనెంబరు 122లో హెచ్ఎండీఏ అనుమతితో 900 చదరపు గజాల్లో భవన నిర్మాణం కొనసాగుతున్నది. తాజా అలైన్మెంట్తో సెల్లార్ సహా భవనం ముందు భాగం పూర్తిగా ధ్వంసం కానుంది.

దవాఖాన కోసమని అనుకొంటే..: సర్వేనంబరు 121లో హెచ్ఎండీఏ అనుమతితో నిర్మించిన ఈ భవనాన్ని దవాఖానకు ఇచ్చేందుకు సిద్ధమవు తున్నారు. ఇంతలోనే కూలుస్తామంటూ అధికారులు సిద్ధమౌతున్నారు.

శ్రీనివాస.. శ్రీనివాస..: సర్వేనంబరు 113లో హెచ్ఎండీఏ అనుమతులతో శ్రీనివాసం అపార్టుమెంటును నిర్మించారు. కొత్త అలైన్మెంట్తో ఫ్లాట్లన్నీ ముందువైపు ధ్వంసం కానున్నాయి.

అద్దాల భవనాలకీ అధోగతి..: సర్వేనంబరు 102లో హెచ్ఎండీఏ అనుమతులతో నిర్మించిన అందమైన భవనాలు ఇవి. కోట్ల రూపాయలు వెచ్చించిన వీటినీ కూల్చేందుకు మార్కింగ్ చేశారు.

స్పోర్ట్స్ కోర్టుకూ కష్టమే : సర్వే నంబరు 121లో ఏర్పాటవుతున్న స్పోర్ట్స్ కోర్టు ఇది. నిర్మాణ దశలోనే దీని రూపు ఎలా ఉంటుందో కూడా ఊహించలేని దుస్థితి.
నిబంధనల ప్రకారమే కట్టుకున్నం!
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మా ఇండ్లను నిర్మించుకొన్నాం. హెచ్ఎండీఏ అధికారులే మొన్నటి వరకు అంటే 2024 ఏడాదిలో కూడా మా బిల్డింగ్‌కు ఓసీ జారీచేశారు.

ఇప్పుడు దాన్నిపక్కనబెట్టి రాత్రికిరాత్రి జీవోలను మారుస్తూ వంద అడుగుల రోడ్డు అలైన్‌మెంట్‌ను ఎలా చేస్తారు? రెండేండ్లలోనే ఇంత దారుణమా? ఇది సరైన పద్దతి కాదు. ఎవరో ఓ రియల్టరు, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు వారి స్వప్రయోజనాల కోసమే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది.
-స్వరూపరావు, సెవెన్‌హిల్స్ నివాసితురాలు
ఇలా ఎక్కడా లేదు
దేశ చరిత్రలో సెల్లార్లను సైతం రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్‌లు చేసిన చరిత్ర ఎక్కడా లేదు. ఇదే జరిగితే సెవెన్‌హిల్స్ అపార్టుమెంట్లు మొత్తం కుంగిపోయే ప్రమాదం ఉంది. సెవెన్‌హిల్స్ ప్రధాన గేటు ముందు ఉన్న సెల్లారుతో పాటు వినాయక దేవాలయం, వెనుక గేటులోని సెల్లార్లు కూడా ఈ వంద అడుగుల రహదారుల మాస్టర్‌ప్లాన్ మార్కింగ్‌లో ఉండటంతో సెవెన్‌హిల్స్ కనుమరుగయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి అవే ప్రభుత్వాలు నిబంధనలను బేఖతార్ చేస్తూ కొంతమంది ప్రయోజనాల కోసం మాస్టర్ప్లాన్లను మార్చడం సరైన చర్య కాదు. ఎంతటి పోరాటానికైనా మేము సిద్దమే.
-జయకర్, సెవెన్‌హిల్స్ ప్రతినిధి
ఫిర్యాదు చేసినా..
అర్ధాంతరంగా జీవోల మార్పిడిపై హెచ్ఎండీఏలో ఫిర్యాదు చేశాం. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాం. అయితే, ఇంకా మీకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు కదా అని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో బుల్డోజర్లతో రోడ్లను విస్తరిస్తామంటూ పనులు చేపడుతున్నారు.
– ప్రసన్నీతారావు, క్రియ మోంటెస్సరీ స్కూల్ యజమాని
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

