హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై డ్రగ్స్ కేసు నమోదుకాగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. చంచల్గూడలోని సెంట్రల్ జైలులో ఉన్న ప్రణీత్ హనుమంతు గతంలో డ్రగ్స్ సేవించినట్టు నార్కోటిక్ బ్యూరో దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఓ తండ్రి, కూతురు వీడియోపై అసభ్యకరంగా మాట్లాడిన కేసులో ఈ యూట్యూబర్‌ని ఇటీవలే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం ప్రణీత్‌ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలపై రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘యువ లిమిట్లెస్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడినట్టు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎక్స్ వేదికగా తెలియజేసింది. ఎన్సీసీ ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ ‘యువ లిమిట్లెస్’ అనే పాడ్‌కాస్ట్‌ను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృతంగా చర్చించామని టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. మాదక ద్రవ్యాల కు వ్యతిరేకంగా పోరాడేందుకు యువతను ప్రోత్సహించేలా సందీప్ శాండిల్య మాట్లాడారని ఎన్సీసీ డైరెక్టరేట్ కొనియాడింది.