హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి, రచయిత, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2025 అందుకున్నారు. ఆయన రచించిన కవితా సంపుటి ‘అనిమేష’కు ఈ అవార్డు లభించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని కామిని ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందజేశారు. కరోనా కాలంలో ఆయన రచించిన ‘అనిమేష’ దీర్ఘకవితా సంపుటిని వచన కవిత్వం విభాగంలో ఎంపికచేశారు.
కరోనా కాలపు కన్నీటి దృశ్యాలు, మనిషి ఎదురొన్న జీవన బీభత్సాన్ని ‘అనిమేష’లో అత్యంత ఆర్ద్రతతో సిధారెడ్డి ఆవిషరించారు. ‘ఒక బాధ కాదు, అది సమాజపు సామూహిక వేదన’ అని చాటారు. తెలుగు రాష్ర్టాల నుంచి నందిని సిధారెడ్డి ఒక్కరే ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సందర్భంగా నందిని సిధారెడ్డికి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలాచారి అభినందనలు తెలిపారు.