అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాలపై కన్నేసి ఉంచుతామని స్పష్టంచేశారు. ఒక్కో ఈవీఎంను నాలుగుసార్లు తనిఖీ చేస్తున్నామని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వికాస్‌రాజ్ వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాలపై కన్నేసి ఉంచుతామని చెప్పారు. ప్రజల్లోకి చెడు ప్రచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణలు కొనసాగుతున్నాయని, ఈ నెల 19 వరకు ఓటరు నమోదు, సవరణలకు అవకాశం ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
పక్కా ప్రణాళిక
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సాధారణ ఎన్నికల కోసం నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ఇందులో ప్రధానమైనది ఈవీఎంలను పరిశీలించడం. దీనిని మొత్తం నాలుగు దశల్లో చేస్తాం. ఇందులో ఇప్పటికే రెండు దశలను పూర్తి చేశాం. మొదటి దశలోఅధికారులు అంతర్గతంగా పరిశీలించారు. ఆ తరువాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను పరిశీలించాం. మరో రెండుసార్లు ఈవీఎంలను, వీవీప్యాట్లను పరిశీలిస్తాం. ఇందులో ఒకసారి బ్యాలెట్ పేపర్ అమర్చే సమయంలో చేస్తాం. అంతకుముందే మరోసారి పరిశీలిస్తాం. రాష్ట్రంలో ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి.
అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా
ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ కొనసాగుతున్నది. ఈ నెల 19వ వరకు మార్పు, చేర్పులకు అవకాశం ఉన్నది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తాం. అర్హులైన ఓటర్లందరూ ఓటుహక్కు కోసం, చిరునామా మార్పు కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదో లేదో చూసుకుంటే మంచిది. బూత్ లెవల్ అధికారుల సమాచారం, వారి ఫోన్ నంబర్లు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా అర్హులైన వారు ఓటుహక్కు పొందే విధంగా కృషిచేయాలి. రాజకీయ పార్టీలతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాం. ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం ఓటరు పోర్టల్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. విద్యావంతులు, పట్టణాల్లోని ప్రజలు ఓటుహక్కు కల్పించుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌లోని వేలాది గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్లి బీఎల్వోలు దరఖాస్తులు స్వీకరించారు.
భారీ సంఖ్యలో మార్పులు చేర్పులపై…
ఓటర్ల జాబితా మార్పు చేర్పులపై సీఈసీ అధికారాలు, నిబంధనల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఓటరు జాబితా రూపొందించే పూర్తి అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉండేది. కొంతకాలం క్రితం సీఈసీ మార్పులు చేసింది. ఓటరు జాబితాల్లో అత్యధిక సంఖ్యలో ఒకేసారి, ఒకే నియోజకవర్గం, ఒకే ప్రాంతంలో పేర్లు చేర్చడం, తీసివేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి వారం నియోజకవర్గాల వారీగా కొత్త ఓట్లు, తొలగింపు, చిరునామా మార్పు కోసం వచ్చిన దరఖాస్తులను సీఈసీకి పంపించాల్సి ఉంటుంది. ఈ వివరాలను రాజకీయ పార్టీలకు కూడా ఇవ్వాలని సీఈసీ సూచించింది. దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తం ఓట్లు చేర్చినా, తొలగించినా ఆ సమాచారం రాజకీయ పార్టీలకు తెలుస్తుంది. దీనిపై వారు అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో చేర్పులు, తొలగింపునకు అవకాశం లేదు.
ప్రతి అధికారికి శిక్షణ
రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు, పోలీసులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇకపై జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎన్నికలకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లు రాష్ట్రస్థాయిలో పూర్తిచేశాం. ఇంకా ఏమైనా అవసరం ఉంటే జిల్లా స్థాయిలో కొనుగోలు చేస్తారు.
2.50 లక్షల మంది సిబ్బంది
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది సిబ్బంది అవసరమని అంచనా. ఇందులో ప్రిసైడింగ్ అధికారి, అసిస్ట్టెంట్ ప్రిసైడింగ్ అధికారి సహా దాదాపుగా 1.50 లక్షల మంది, ఇతర సిబ్బంది మరో లక్ష మంది అవసరం. దీని కోసం శాఖలవారీగా వివరాలు సేకరిస్తున్నాం. ఎన్నికల విధుల నుంచి విద్యుత్తు, వైద్యారోగ్య శాఖ లాంటి సిబ్బందిని మినహాయిస్తాం. ఈ సంఖ్యకు అదనంగా పోలీసు సిబ్బంది ఉంటారు. ఎన్నికల్లో శాంతిభద్రలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాలు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలు అవసరం లేకుండా ఓటుహక్కు వినియోగించుకునే విధంగా చేస్తాం.
చెడు వ్యాప్తి చెందకముందే చర్యలు
సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఎన్నికల సంఘంపై చేసే తప్పుడు, దుష్ప్రచారంపై ఎప్పటికప్పుడు వేగంగా స్పందించాలని నిర్ణయించాం. ప్రజల్లోకి చెడు వ్యాప్తి చెందకముందే చర్యలు తీసుకుంటాం. దీని కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సానుభూతిపరులు, కార్యకర్తలు చేసే తప్పుడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాలకు అనుగుణంగా నడుస్తాం. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో పర్యటించి, అక్కడ అనుసరించిన విధానాలను అధ్యయనం చేశాం. ఎన్నికల నిర్వహణలో ప్రజలకు ఉపయోగపడే వాటిని ఇక్కడ అమలు చేస్తాం.
2012కు ముందు ఉన్న కార్డు నంబర్లు మారాయి
కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్నవారికి, చిరునామా మార్చుకున్నవారికి కొత్త ఓటరు కార్డును ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటికే 25 లక్షల కార్డులు పంపిణీ చేశాం. మరో 8 లక్షల కార్డులకు ఆర్డర్ ఇచ్చాం. కార్డుల ముద్రణ, పంపిణీ కొనసాగుతున్నది. 2012కు ముందు ఉన్న ఓటరుకార్డు నంబర్లో సీఈసీ మార్పు చేసింది. వీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై త్వరలో ప్రచార కార్యక్రమం నిర్వహించి, అన్ని వివరాలను వెల్లడిస్తాం. 80 ఏండ్లు నిండినవారు దరఖాస్తు చేసుకుంటే ఇంటి నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. వీరితోపాటుగా 40% కంటే ఎక్కువ అంగవైలక్యం ఉన్నవారు కూడా ఇంటి నుంచే ఓటుహక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.