సుబేదారి, ఏప్రిల్ 24 : విధుల్లో భాగంగా ఆఫీసుకు వెళ్తున్న నమస్తే తెలంగాణ సబ్ ఎడిటర్‌పై వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే బైక్‌ను రోడ్డుపై నెట్టేసి గాయపరిచారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సబ్ ఎడిటర్ కెంచ అశోక్ బుధవారం కరీమాబాద్ నుంచి బైక్‌పై మడికొండ యూనిట్ కార్యాలయానికి బయలుదేరాడు. చౌరస్తా వద్దకు చేరుకోగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బైక్‌ను ఆపి నెట్టివేశాడు. దీంతో అశోక్ బండితోపాటు రోడ్డుపై పడిపోగా కుడి చెయ్యి బొటన వేలుకు గాయమై, బైక్ దెబ్బతిన్నది. ఈ ఘటనతో నివ్వెరపోయిన అశోక్ తనను ఎందుకు నెట్టి వేశారని ఇన్స్పెక్టర్ను నిలదీయగా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఎక్కువ చేస్తే ఎఫ్ఐఆర్ చేసి లోపల వేస్తా అని బెదిరించాడు. కాంగ్రెస్ జనజాతర బహిరంగసభ విధుల్లో భాగంగా మడికొండ జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సబ్ ఎడిటర్ అశోక్‌పై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ దాడిచేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇన్స్పెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు కమిషనర్ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య హెచ్చరించారు.