హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఆనాడు బీజేపీ నేతలు మాట్లాడిన మాటలకు భయపడి ఉంటే తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆసార్ సాధించేదా? భారతదేశం పేరు, తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మార్మోగేదా? అని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆసార్ సాధించిన సందర్భంగా సినిమా బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ కీర్తిని, తెలంగాణ పేరును మరోసారి విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళికి, గేయ రచయిత చంద్రబోస్‌కు, స్వరకల్పన చేసిన కీరవాణికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా మరికొందరు బీజేపీ నేతలు దీనిపై నానాయాగీ చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టారని సతీశ్‌రెడ్డి గుర్తు చేశారు.
సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగలబెడతామంటూ స్వయంగా బండి సంజయ్ ప్రకటన చేశారని తెలిపారు. అయితే, ఇప్పుడు ఆ సినిమాకు అవార్డు రాగానే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారని, బెదిరించేది వాళ్లే.. అవార్డు రాగానే సంబురాలు చేసేదీ వాళ్లేనని దుయ్యబట్టారు. ఇంత అద్భుతమైన సినిమాను ఆసార్కి నామినేట్ చేయాలనే సోయి కూడా కేంద్రంలోని బీజేపీ సరారుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా విషయంలోనూ బీజేపీ తన గుజరాత్ ఫార్ములాను, స్వార్థపూరిత బుద్ధిని చూపెట్టుకొన్నదని తెలిపారు. గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ను ఆసార్కు నామినేట్ చేసిందని, కానీ ఆర్ఆర్ఆర్ సినిమా టీం స్వయంగా ఆసార్కు దరఖాస్తు పెట్టుకొని పోటీలో పాల్గొన్నదని ఆయన వివరించారు. కేంద్రం నామినేట్ చేసి ఉంటే ఇంకా గౌరవప్రదంగా ఉండేదని వెల్లడించారు. తెలుగుజాతికి, తెలుగు సినిమాకు మరింత గౌరవం వచ్చి ఉండేదని పేర్కొన్నారు.