హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మ్యూల్ ఖాతాల ద్వారా షెల్ కంపెనీలకు కోట్ల రూపాయలను బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వడ్డేవల్లి శరణ్‌కుమార్ అనే వ్యక్తి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆయనను ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్టు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ శనివారం వెల్లడించారు. విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు తెలుగు రాష్ర్టాల్లో మ్యూల్ ఖాతాలను సృష్టించేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్నారని, అలాంటి ఏజెంట్లలో ఒకడైన శరణ్‌కుమార్ దుబాయ్‌లో ఉంటూ అక్కడి నుంచే తన నెట్వర్క్ ను విస్తరించుకున్నాడని దర్యాప్తులో తేలింది. ఆ నెట్వర్క్ ద్వారా శరణ్ వివిధ బ్యాంకుల్లో పలు మ్యూల్ ఖాతాలను తెరిపించాడని, ఆ ఖాతాలను ఉపయోగించాడని, తన సహచరులతో కలిసి 6 షెల్ కంపెనీలకు అక్రమంగా కోట్ల రూపాయలు తరలించాడని గుర్తించినట్టు సీఎస్బీ పో లీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో శంషీర్‌గంజ్ ఎస్బీఐ మేనేజర్‌తోపాటు ముగ్గురు ఖాతాదారులు, ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు.