ఖైరతాబాద్, ఫిబ్రవరి 3: ఎమ్మార్పీఎస్ 30 ఏండ్ల పోరాటంలో ఏనాడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని, గాంధేయ మార్గంలోనే పోరాటం సాగించామని మందకృష్ణ మాదిగ తెలిపారు. పలు సాకులను ఎత్తిచూపుతూ లక్ష డప్పులు-వెయ్యి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం తగదని సూచించారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘మాదిగ సంస్కృతికి చిహ్నం డప్పు. మా 30 ఏండ్ల వర్గీకరణ పోరాటానికి ఊపిరిపోసింది కూడా ఈ డప్పే. ప్రస్తుతం డప్పు సంస్కృతి కనుమరుగవుతున్నది.
ఈ తరుణంలో చరిత్రను గుర్తుచేసే విధంగా, గుర్తుంచుకునే విధంగా లక్ష డప్పులు-వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని ఈ నెల 7న నిర్వహించాలని నిర్ణయించాం. దీనిని ప్రభుత్వం ఓ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలి. అంతేగానీ ట్రాఫిక్ జామ్ అవుతదని, వీవీఐపీ జోన్ కాబట్టి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతదని సాకులు చూపిస్తూ అనుమతి నిరాకరించడం తగదు. గాంధేయ మార్గంలోనే ప్రదర్శన నిర్వహిస్తాం.
ప్రభుత్వానికి మరోసారి లేఖ ద్వారా విన్నవిస్తాం. ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేలా సానుకూలంగా స్పందించాలి’ అని కోరారు. సమాజంలో ప్రతి ఉద్యమానికి డప్పు ప్రధానమైనదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని మందకృష్ణ సూచించారు. మీడియా సమావేశంలో తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్విరాజ్ యాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ, దరువు ఎల్లన్న, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్, రెడ్డి జాగృతి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ల బిక్షపతి మాదిగ, రాజేందర్, నరసింహ, బైరపోగు శివకుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.