Dharmapuri Arvind | హైదరాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి బీజేపీలో చేరుతానంటే వ్యక్తిగతంగా తాను ఆహ్వానిస్తానని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవి నుంచి తొలగిస్తే రేవంత్రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా అని ప్రశ్నించారు. అదే జరిగితే తాను స్వయంగా బీజేపీలోకి ఆహ్వానిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేతలు, రేవంత్రెడ్డి తనకు మిత్రులేనని పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీ కోసమే రేవంత్రెడ్డి ప్రధాని మోదీని మంచోడని పొగుడుతున్నారని వివరించారు. ఫ్యూచర్ సిటీకి లోటస్ అని పేరు పెడితే.. కేంద్రం నుంచి అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలనాపరమైన శూన్యత కనిపిస్తున్నదని.. దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.