Telangana | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వాళ్లు ప్రజాసంఘాల నేతలు.. ప్రశ్నించే గొంతులుగా పేరు ప్రఖ్యాతులున్నవారు.. బడుగుల కోసం నినదించినవారు.. గతంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యమాలు నడిపారు. ప్రజా పోరాటాలు చేశారు.. అదంతా గతం! కానీ, నేడు వారి ధోరణి మారింది. వారి గొంతులు మూగబోతున్నాయి. ఫార్మా కంపెనీల కోసం ప్రభుత్వాలు బలవంతంగా గిరిజనుల భూములను సేకరిస్తుంటే ఒక ప్రజాసంఘం నేత కూడా నోరు విప్పడం లేదు. అన్నదాతలు, ఆటోడ్రైవర్లు, మూసీ బాధితుల ఆత్మహత్యలు చేసుకుంటున్నా, లగచర్ల అగ్నిగుండమై మండుతున్నా పెదవి విప్పడంలేదు. వీరిలో కొందరికి సర్కార్ కొలువులు దొరికాయి. మరికొందరు వెయిటింగ్లో ఉన్నారనే టాక్ వినిపిస్తున్నది.
మీ ద్వంద్వ నీతికో.. దండం!
ఆయనో సీనియర్ ఉద్యమకారుడు. పేరు చివర కులం తోక కత్తిరించుకున్నారు. కానీ, తనువెల్లా కుల ఆధిపత్యమే ఉన్నదనేది ఆయన మీద ఉన్న విమర్శ. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ జేఏసీ నేతగా వ్యవహరించి, ఆ తరువాత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. 2021లో ఇందిరాపారు ధర్నాచౌక్ వద్ద భూ నిర్వాసితుల దీక్షకు పిలుపునిచ్చారు. మల్లన్నసాగర్ మాత్రమే కాదు నిమ్జ్, కొండపోచమ్మసాగర్, సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు. నీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ది నిజాం పాలన అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం 2013 చట్టానికి మించి భూ నిర్వాసితులకు పరిహారం కట్టిస్తుంటే దానిని దాచి పెట్టి ఉద్యమాలు చేశారు. ఇవ్వాళ వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ దాష్టీకం జరుగుతున్నది. భూములు ఇవ్వనందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. కనీసం వాళ్లను పలకరించి, మీకు మేం అండగా ఉన్నామని చెప్పలేని ఆ నేత తీరుపై మండిపడుతున్నారు లగచర్ల ఫార్మా బాధితులు. ‘హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రశ్నించక పోతివి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో లక్షలాదిమంది నిర్వాసితులు అవుతున్నా పెదవి విప్పక పోతివి. గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్నా మౌనం వీడలేదు. రైతాంగానికి ఇంత బువ్వపెట్టే జల ప్రాజెక్టుల బాధితులే నిర్వాసితులు గానీ, ఎవరికీ ఉపయోగం లేని మూసీ ప్రాజెక్టు, లగచర్ల బాధితులు నిర్వాసితులు కాదనుకునే మీ ద్వంద నీతికో దండం’ అంటున్నాయి ఆయా బాధిత వర్గాలు.
ఇకడ ‘ఆకులు’చెల్లక..
‘కొత్త పార్టీ పెడతా.. సామాజిక విప్లవం తెస్తా..’ అంటూ ఒక అధికారి ఉద్యోగం పోగొట్టుకొన్నారు. ఒక ఫోరం పేరుతో జనంలోకి వచ్చారు. సరారుపై పోరాటం చేస్తానన్నారు. ఒక సామాజిక వర్గంపై పేటెంటు హకులన్నీ తనవేనని చెప్పుకున్నారు. ఆరు నెలలు తిరగక ముందే అన్నీ వదిలేసి పొరుగు రాష్ట్రం వలస పోయారు. అక్కడ భోగభాగ్యాలు అనుభవించారు. అఖరికి అకడా ఆకులు చెల్లక మళ్లీ ఇకడికే వచ్చారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టారు. విద్యకు మెరుగైన నిధుల కోసం ఉద్యమిస్తానని చెప్పుకున్నారు. మూడో కంటికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రచనా కమిటీలో సభ్యుడిగా చేరారు.. జాబ్ క్యాలెండర్ రాశారు. ఇదే జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ పత్రికలకు పతాక శీర్షికన ప్రకటనలు ఇచ్చుకున్నది. ఇదే పెద్ద మనిషి మీడియా ముందుకొచ్చి ‘జాబ్‌క్యాలెండర్ సూపర్, నిరుద్యోగులు నిరంభ్యంతరంగా నమ్మవచ్చు’ అని చిలుక పలుకులు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నది. గుట్టుగా చేసిన సహాయానికి బహుమతిగా ఆయనకు కొత్త సరారులో కొలువు దకింది. కానీ, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. నాడు నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తిన ఆయన నేడు అదే నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనల వైపు కూడా చూడటం లేదు. ఫార్మా విలేజ్ పేరిట రైతుల పంచ ప్రాణమైన భూములను లాగేసుకుంటుంటే, ఫార్మా నిర్వాసితులు ముందుగా ఆయన ఇంటి గడపే తొకారట. సహాయం చేయాలని రెండు చేతుల దండం పెట్టి వేడుకున్నా కనికరం కలగలేదని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఆ ధికారి ఎందుకు మొకుతున్నడో..!
మరో నేతది విశిష్ట శైలి. పోరాటమే ఆయన విశిష్టత. బలమైన పౌరహకుల ఉద్యమకారుడే. నిన్నటి దాక నిరాడంబర, నిస్వార్థజీవే. ఇన్నాళ్లు రాజ్యధిక్కారం చేసిన ఆయన.. వృద్ధాప్యంలో పాలకుల పంచన చేరడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశానికి వెళ్లి బస్తర్‌లో కూంబింగ్‌కు మద్దతిస్తామని చెప్పి వచ్చారు. అటువంటి పాలకుడితో ఈ పెద్దమనిషికి సోపతి ఎకడిది? మణిపూర్ హింసాకాండ తరహాలో తెలంగాణలోని లగచర్లలో గిరిజనులపై అధికార కాంగ్రెస్, పోలీసుల దమనకాండ సాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. అయినా హకుల ఉద్యమ నేతగా ఇప్పటివరకు గిరిజనులకు మద్దతు ప్రకటించకపోవడం పౌర సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. బస్తర్‌లో ఆదివాసీలు, మూసీలో నిర్వాసితులు, లగచర్లలో ఫార్మా బాధితులు తమ హకుల కోసం కొట్లాతుంటే వీరు మాత్రం ప్రభుత్వంతో చెట్టపట్టాలేసుకొని సలహాలు ఇవ్వడం కోసం పరితపించడం విమర్శలకు తావిస్తున్నది.
రైతును మింగే స్వరాజ్యం
రాజకీయ పార్టీలతో అనుబంధం లేదంటారు. 12 ఏండ్ల అనుభవం అని చెప్తారు. కానీ ప్రతి అడుగూ వంచనే. ప్రతి ప్రసంగం మోసమే. రైతు ఎజెండా పేరు మీద పకాగా మూడు రంగుల జెండాను మోశారనే ఆరోపణలు ఉన్నాయి. లగచర్ల రైతుల మీద పోలీసు దాడులు, పాలకుల జులుం ప్రదర్శిస్తుంటే కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా వీళ్లు ఎకడున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 495 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ పెద్దలు ఒకరంటే ఒకరు కూడా రైతుల పక్షాన నిలబడి మాట్లాడటం లేదు. కనీసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలనైనా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడం లేదు.
‘ఫోరం’ ఎవరి కోసం..
అతనో అగ్రకులం నేత.. తాను బడుగు బలహీనవర్గాల నేతను అని, గుడిసెల సంఘానికి కూడా నాయకుడినని చెప్పుకుంటారు. అవినీతి రహిత పాలన కావాలంటారు. జల ప్రాజెక్టుల లెకలు, రైతుబంధు, నిరుపేదల సంక్షేమ పథకాలు, జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు వద్దని చెప్పే ఆయన.. అధికార మార్పిడి జరిగాక పత్తా లేకుండా పోయారు. టూరిజం కోసం మూసీ సుందరీకరణ మీద రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నా… హైడ్రా పేదల ఇండ్ల మీద పడుతున్నా.. మూసీ బఫర్ జోన్ పేరిట పేదల గుడిసెలను ప్రభుత్వం పీకేస్తున్నా.. వారిని బలవంతంగా తరలిస్తున్నా… కాంట్రాక్టు బిల్లులకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు 10% కమీషన్ ఫిక్స్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు పెట్టేందుకు బలవంతంగా భూములు సేకరిస్తున్నా.. ప్రతి శాఖలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపణలు వస్తున్నా.. స్వయంగా ముఖ్య నాయకుడే శాఖాధిపతులకు టార్గెట్లు పెట్టి వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నా.. ఆ ఫోరం సారు మాత్రం పెదవి విప్పడం లేదు. వ్యవస్థీకృతమైన అవినీతి మీద ఇప్పటివరకు ఒక సమావేశం పెట్టలేదు. ఎందుకిలా చేస్తున్నాడని ఆరా తీస్తే.. సర్కార్ ప్రాపకం కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.
ఆయన మాటలే బెల్లం
జాతిబిడ్డల మీద ఆయన మాటలు బెల్లం మూటలు. జాతి కోసమే తన జీవితం అని ప్రసంగాలు దంచుతారు. తన జాతి హకుల పోరాట సమితితో గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆయన జాతి ఉద్యమాలను విస్మరించలేం గానీ, ఇప్పుడాయనకు సరారు కొలువు దొరికింది. బుగ్గకారు జోరు తప్ప బంజారా బిడ్డల గోడు వినిపించడం లేదు. కలెక్టర్ మీద దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి తండాపై దాడులు చేస్తున్నారు. భూములు ఇవ్వాలని గొంతులు పిసికి, కండ్లకు గంతలు కట్టి కొట్టారు. అనుచితంగా ప్రవర్తించారని బంజారాబిడ్డలు గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లి గోడు చెప్పుకుంటా విలపిస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆ ఉద్యమనాయకుడి స్పందనలేదు.
సార్..చూస్తున్నారా?
ఈయన ఇంకో నిరాడంబర జీవి. వీరిదీ అందే పంథా. ఒడిదుడుకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఆపన్నహస్తమే. ఆదివాసీల హకుల అణచివేతను రకరకాల మార్గాల్లో ప్రతిఘటిస్తూ వచ్చిన ప్రొఫెసర్. ఇప్పుడెందుకో రాజ్యం కొలువు మీద మోజు పెరిగినట్టుంది. సరారు కొలువు సంపాదించారు. ఇప్పుడాయనకు సరారు దాష్ట్టీకాలు కనిపించడం లేదు. స్వరాష్ట్రంలో ఊహకు అందని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగి, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడూ సప్పుడు లేదు. పచ్చని పంట పొలాల మధ్య ప్రైవేటు ఫార్మా కోసం పాలకులు పోలీసులను ప్రైవేటు సైన్యంగా మార్చుకొని గిరిజనుల భూములను గుంజుకుంటున్నారు. అయినా పాలకులను నిలదీయకపోవడం విస్మయం కలిగిస్తున్నది.