హిమాయత్‌నగర్, జూలై 19: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ బ్యాంకులు కీలకపాత్ర వహిస్తున్నాయని, వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే ప్రజలతో కలిసి జాతీయ స్థాయిల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ అప్పస్వామి, రాష్ట్ర కార్యదర్శి జీ నాగేశ్వర్ హెచ్చరించారు.
భారత 55వ బ్యాంకు జాతీయీకరణ దినోత్సవం సందర్భంగా బుధవారం నారాయణగూడలోని ఎస్బీఐవోఏ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బ్యాంకులను ప్రైవేటీకరిస్తే జరిగే అనర్థాలపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశంలో కాన్ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రాజ్‌కుమార్, సతీశ్, వెంకన్న, కే ఆంజనేయప్రసాద్, ఎం విక్రమ్, కృష్ణంరాజు, టీ హనుమంతరావు, సీఆర్ భీమ్‌సింగ్, టీఎన్ రవిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.