Telangana | టేకుమట్ల, నవంబర్ 5: నవ మాసాలు మోసి నాడు బిడ్డకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి.. నేడు తన కాలేయం నుంచి కొంత దానం చేసి పునర్జన్మనిచ్చింది. బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయదనే నానుడిని నిజం చేసింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దండ్రే రమేశ్-కవిత దంపతుల కూతరు మహాలక్ష్మి(13) జూలై నుంచి కాలేయ వ్యాధితో బాధపడుతున్నది. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చూపించగా మహాలక్ష్మి కాలేయం దెబ్బతిన్నదని, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు సూచించారు.
తల్లడిల్లిపోయిన ఆ తల్లి.. బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు తన కాలేయాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. దెబ్బతిన్న పాప కాలేయాన్ని తొలగించిన వైద్యులు.. ఈ నెల 2న 12 గంటల పాటు ఆపరేషన్ చేసి తల్లి కాలేయంలోని కొంత భాగాన్ని పాపకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ప్రస్తుతం తల్లి కోలుకుంటున్నదని, పాప మరో రెండు రోజుల్లో కోలుకుంటుందని, ఇంకా 20 రోజులు దవాఖానలోనే ఉండాలని, వైద్యులు చెప్పినట్టు పాప బంధువులు తెలిపారు.
పాప సమస్యను, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన బంధుమిత్రులు, వ్యాపారులు, నాయకులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఇతరులతో సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం చేయిస్తూ ఆ కుటుంబానికి ఆర్థికంగా, మానసికంగా అండగా నిలుస్తున్నారు. పెద్దమొత్తంలో ఖర్చులు అవుతున్నాయని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని, దాతలు 9701329434 నంబర్‌కు ఆర్థిక సహాయం చేయాలని బాలిక తండ్రి దండ్రే రమేశ్ వేడుకుంటున్నాడు.