Mahabubabad | డోర్నకల్, ఫిబ్రవరి 17: ‘నా భూమిని పెద్ద కొడుకు అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. న్యాయం చేయండి’ అంటూ కన్న కొడుకు ఇంటి ఎదుట ఓ వృద్ధురాలు దీక్ష చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లలో జరిగింది. గ్రామానికి చెందిన తాటికొండ కమలమ్మ పేరిట ఉన్న రెండు ఎకరాల 20 గుంటలను పెద్ద కుమారుడు మల్లారెడ్డి తన స్నేహితుడైన రెవెన్యూ అధికారి సహకారంతో పట్టా చేయించుకున్నాడు. కన్నకొడుకు మోసం చేశాడని తెలుసుకున్న కమలమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. తన భూమి తనకు తిరిగి ఇవ్వాలని కొడుకు ఇంటి ఎదుట సోమవారం దీక్షకు కూర్చున్నది. తనకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించనని స్పష్టం చేసింది.