హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లల్లో అత్యధికులు ముంబై ఐఐటీ వైపు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్అండ్ ఇంజినీరింగ్ కోర్సులో చేరుతున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలైన సందర్భంగా పలువురు ర్యాంకర్లను కదిలిస్తే సాఫ్ట్వేర్ రంగమే మా గమ్యస్థానమని తేల్చిచెప్తున్నారు. జాతీయంగా 23 ఐఐటీలున్నాయి. కానీ అత్యధికులు ఐఐటీ ముంబై , సీఎస్ఈ కోర్సులోనే చేరటానికి ఇష్టపడుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సులో చేరి స్టార్టప్స్‌గా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా రాణిస్తామని స్పష్టం చేస్తున్నారు. వారిలో పలువురి మనోగతం ఇలా ఉంది.
సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతా
మా తల్లిదండ్రులు ఇది చేయమని.. అది చేయమని నాపై ఒత్తిడి తేలేదు. నాదారి నాదే. చిన్నప్పటి నుంచి ఇష్టపడి చదివా. 10వ తరగతి మధ్యలోనే జేఈఈ ప్రిపరేషన్ ప్రారంభించా. రెండున్నరేండ్లు జేఈఈ కోసం శ్రమించా. జేఈఈ మెయిన్స్‌ను నాలెడ్జ్‌ను పరీక్షించుకునేందుకే ఉపయోగించుకున్నా. మెయిన్‌లో 200లోపు ర్యాంకర్లందర్ని ఒకే గాటన కట్టొచ్చు. దాదాపు అందరిలోను ఒకే సామర్థ్యాలుంటాయి. నా ఫోకస్ అంతా అడ్వాన్స్డ్పైనే పెట్టా. – అర్నవ్సింగ్
సివిల్స్ రాస్తా..ఐఏఎస్ కొడుతా
రోజుకు 10గంటలు కష్టపడ్డా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చింది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ) కోర్సులో చేరుతా. బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ రాసి.. ఐఏఎస్ కొడతా.
-డీ జ్ఞాన రుత్విక్ సాయి
రోజుకు 14గంటలు కష్టపడ్డా
జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14గంటలు కష్టపడ్డా. ఫిజిక్స్ కొంచెం కఠినం గా అనిపించింది. గణితం, కెమిస్ట్రీ సబ్జెక్టులపై పట్టుసాధిం చా. 78వ ర్యాంకు రావడం సంతోషానిచ్చింది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరుతా. – రసజ్ఞ