హైదరాబాద్: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram Sudhakar Reddy) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం (ఆగస్టు 24) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీపీఐ ప్రధాన కార్యాలయం మఖ్దూం భవన్లో (Makhdoom Bhavan) ఉంచనున్నట్లు పార్టీ వర్గాల్లు వెల్లడించాయి. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి (Gandhi Medical College) అప్పగిస్తామని తెలిపారు. అదేవిధంగా నేత్రాలను ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి దానం చేయబడ్డాయని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించిన సురవరం.. 1998, 2004లో రెండుసార్లు నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సీపీఐ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. చండ్ర రాజేశ్వర్‌రావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్రసమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, ఓయూ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.