హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): జాతీయంగా ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (యూజీ)-2024 దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడగించింది. ఈ గడువు శనివారంతో ముగియగా, తాజాగా ఈ నెల 16 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 16న రాత్రి 10:50 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వగా, అదే రోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించే అవకాశాన్నిచ్చింది. ఈ ఏడాది నీట్ (యూజీ)కు రికార్డు స్థాయిలో 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నిరుడు 20.8 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించగా, ఈ ఏడాది అదనంగా 4.2 లక్షల దరఖాస్తులు రావడం విశేషం. ఈ 25 లక్షల మందిలో 13 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు. జాతీయంగా 1.09 లక్షల ఎంబీబీఎస్, 26 వేల డెంటల్ సీట్లు ఉన్నాయి. నీట్ (యూజీ) పరీక్షను జాతీయంగా మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 గంటల వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.