Aghori Srinivas | షాద్‌నగర్, మే 2 : సినీ నిర్మాత వద్ద డబ్బులు తీసుకొని మోసగించారనే ఫిర్యాదుపై అఘోరీ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన మోకిల పోలీసులు శుక్రవారం కేసు విచారణలో భాగంగా మరోమారు షాద్‌నగర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రవి ముందు ప్రవేశపెట్టారు. చేవేళ్ల కోర్టులో ప్రవేశపెట్టవెల్సి ఉండగా అక్కడి కోర్టు ఇంచార్జ్ న్యాయమూర్తిగా ఉన్న రవి.. షాద్‌నగర్ న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోవడంతో మోకిల పోలీసులు షాద్‌నగర్ కోర్టులోని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి రవి అఘోరీ శ్రీనివాస్‌కు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో మోకిల పోలీసులు అఘోరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఘోరీతో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.