హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ): ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే రేవంత్ సర్కార్ తప్పుడు కేసు బనాయించిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి చట్టాలను కాలరాస్తూ సొంత రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు. ఫార్ములా ఈ-కార్ రేస్ తెచ్చి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపిన కేటీఆర్‌ను బద్నాం చేసేందుకే కేసుల పేరిట కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతాలక్ష్మారెడ్డి, మాలోతు కవిత, గొంగిడి సునీత, తుల ఉమ, కీర్తిలత తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రూ.50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ దొరికిపోయి జైలుకెళ్లిన రేవంత్‌రెడ్డి, గద్దెనెక్కి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు కూడా సాధ్యపడని విధంగా ఈ-కారు రేస్ తెచ్చి తెలంగాణ ఖ్యాతిని పెంచిన కేటీఆర్‌పై ఏసీబీని ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లాయర్‌తో విచారణకు హాజరైన ఆయనను ఏసీబీ బయట నిలబెట్టి పైశాచిక ఆనందం పొందారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ దర్యాపు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏడాది పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టారని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. తప్పులు ఎత్తిచూపిన కేటీఆర్‌పై ఈ-కార్ రేస్ కేసు పెట్టడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రైతుభరోసా ఎగ్గొట్టి, పింఛన్లకు ఎగనామంపెట్టి, రుణమాఫీలో కోతపెట్టిన ఆయన ప్రజల దృష్టి మరల్చేందుకే కేసుల నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.
మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమించిన కేటీఆర్‌ను అణచివేసేందుకే ప్రభుత్వం ఫార్ములా ఈ-కారు రేస్ కేసు ముసుగులో ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎంపీ మాలోతు కవిత ఫైర్ అయ్యారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ సర్కారు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
కేటీఆర్‌పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపేందుకు కుట్ర చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆయన దుర్మార్గాలను బీఆర్ఎస్ చట్టబద్ధంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి సర్కారు పెట్టినది ముమ్మాటికీ తప్పుడు కేసే అని ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఆయన జైలుకు వెళ్లాడు కాబట్టి.. కేటీఆర్‌ను కూడా జైలుకు పంపాలనే దురుద్దేశంతోనే రేవంత్‌రెడ్డి ఈ-ఫార్ములా కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినంత మాత్రాన మునిగిపోయింది ఏమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీ సెల్ నేత ఎల్ రూప్సింగ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తామని, న్యాయపరంగా కొట్లాడుతామని తెలిపారు. కేటీఆర్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, నిరూపిస్తే దేనికైనా సిద్ధమని స్పష్టంచేశారు.
రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌పై కేసులు పెడుతున్నదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్‌గౌడ్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో వారి ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.