హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలుకాలేదని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల్లో సెంటీమీటర్ కదలిక కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం నారాయణగూడలోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మూడు డీఏలు పెండింగ్ ఉంటేనే గగ్గోలు పెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆరు డీఏలు పెండింగ్ పెట్టడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లులు నాడు రూ.4వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.16వేల కోట్లకు చేరాయని తెలిపారు. 4 నెలలుగా ఈహెచ్ఎస్ డబ్బులు కట్ చేస్తున్నారని, అయినా ఏ ఒక్క దవాఖానలో హెల్త్‌కార్డు చెల్లని పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు. హామీలు, మ్యానిఫెస్టో గ్యారెంటీలను అమలుచేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ‘చలో హైదరాబాద్’ పేరిట ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్రె డ్డి వెల్లడించారు. టీచర్లు భారీగా తరలివ చ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.