హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారం ముగియనున్నది. 85 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం గడువు ముగియనుండడంతో నేడు పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
హామీలను నెరవేర్చాలి ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎస్ఈయూ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్థికేతర డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం పరిష్కరించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని సీపీఎస్ఈయూలో కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమావేశం ఆదివారం సీపీఎస్ఈయూ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అధ్యక్షతన నిర్వహించారు. టర్మినేషన్ విధానాన్ని ఎత్తివేయాలని, మరణించిన, రిటైర్డ్ అయినవారికి బెనిఫిట్స్ అందజేయాలని, ఆరోగ్యబీమా, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ఇన్నారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.