నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రామన్నపేట లో జనావాసాల మధ్య తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇక్క డి ప్రజల ఆవేదనకు, ఆందోళనలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రకటించారు. బుధవారం రామన్నపేటలో అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొన్నారు. అడుగడుగునా పోలీసుల అడ్డగింతలు, తనిఖీల నడుమ.. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా అభిప్రాయం చెప్పి వెళ్లితీరుతానంటూ పోలీసులను హెచ్చరిస్తూ అక్కడికి చేరుకోవాల్సి వచ్చిం ది. అభిప్రాయ సేకరణలో భాగంగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేలా స్పష్టం చేశారు.
‘వ్యక్తిగతంగా నేను గానీ, ఇక్కడి ప్రజలుగా గానీ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదు.. కానీ పరిశ్రమ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం జనావాసాలకు దూరంగా ఉండాలి. వ్యవసాయేతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి.. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని తెరమీదకు తెచ్చారు. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఆందోళనలు, నిరసనలను గమనంలోకి తీసుకుని అనుమతులు రద్దు చేసే దిశగా సిఫార్సులు ఉండాలి. రామన్నపేటలో చేనేత, మత్స్య, గీత లాంటి వృత్తిదారులతోపాటు వ్యవసాయమే ప్రధాన జీవనంగా ప్రజలు జీవిస్తున్నారు. గతంలో ఈ ప్రాంత వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురి కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక కేసీఆర్ నాయకత్వంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులకు నిధులివ్వడంతో వ్యవసాయం రంగం కోలుకుంటుంది.
ఇలాంటి తరుణంలో అంబుజా సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది మళ్లీ వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టడమే. కులవృత్తులు దెబ్బతిని, వ్యవసాయం దివాళీ తీసే ప్రమాదం ఉంది. ఇక్కడి ప్రజల, ఈ ప్రాంత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. ఇది సమంజసం కాదు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం ప్రజల ఆవేదనను, నిరసనను అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కరెక్టు కాదు. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న. ఫ్యాక్టరీ ఏర్పాటును విరమించుకునే వరకూ సకల జనులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. దానికి బీఆర్ఎస్ పక్షాన, ఎమ్మెల్సీగా సంపూర్ణ సహకారం ఉంటుంది. ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలి.’ అని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీ వద్దని స్పష్టం చేశారు. గొర్రెల మేకల సంఘం ప్రతినిధి కల్లూరి మల్లేశ్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ కాలుష్యంతో కుల వృత్తులు నాశనం అవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి మాట్లాడుతూ డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతూ మోసం చేయడం తగదని అన్నారు.