న్యూస్‌నెట్ వర్క్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను సోమవారం తెలంగాణతోపాటు దేశవిదేశాల్లోనూ వైభవంగా నిర్వహించారు. కవిత బర్త్ డే సందర్భంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓ పేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని వేధించడంలో భాగంగానే కవితపై తప్పుడు కేసులు పెట్టి విచారణకు పిలుస్తున్నదని విమర్శించారు. ఏమాత్రం అధైర్యపడవద్దని, తెలంగాణ సమాజం మొత్తం కవిత వెంటే ఉన్నామని నినదించారు. ఈడీ విచారణను ఎదురొంటున్న కవితకు సంఘీభావం తెలిపారు. తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో జరిపిన వేడుకలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్‌సాగర్, శాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కవిత బర్త్ డేకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత చిన్ను గౌడ్ బృందం కవితకు విన్నూతంగా బర్త్ శుభాకాంక్షలు తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో సముద్రపు నీటి అడుగున బ్యానర్లు ప్రదర్శిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. జాగృతి రాష్ట్ర నేత నరాల సుధాకర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రెడ్‌క్రాస్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో 20 మంది రక్తదానం చేశారు. ఎమ్మెల్సీ కవితపై రూపొందించిన పాట సీడీని జాగృతి నాయకులు నిజామాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఖమ్మంలోని తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేక్ కట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి భారీ కేక్ కట్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు సందర్భంగా రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో హోంమంత్రి మహమూద్ అలీ దర్గా పెద్దలతో కలిసి సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ఆచారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో భారత జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ కేక్ కట్ చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాల్లో ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజును బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంగీత రవిశంకర్ ధూపాటి ఆధ్వర్యంలో కవిత దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం చేశారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణరెడ్డి నాయకత్వంలో కవిత బర్త్ డే నిర్వహించారు. ఎన్నో ఏండ్లుగా తమ వెంటే ఉంటూ ప్రోత్సహిస్తున్న కవితక వెంట తామంతా ఉన్నామని, ‘వీ స్టాండ్ విత్ కవిత అక’ అని మహిళలు నినదించారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సోషల్ మీడియాలో సందేశాలు హోరెత్తాయి. ముఖ్యంగా ట్విట్టర్లో ‘హ్యాపీ బర్త్‌డే కవిత దీదీ’ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది. ఓ దశలో ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో #HBDKavithaDidi హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆస్కార్ అవార్డుల ప్రదదానోత్సవం నేపథ్యంలో ఆస్కార్, ఆర్ఆర్ఆర్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోమవారం సోషల్ మీడియాలో ట్రెండిగ్ అయ్యాయి. వాటికి సమానంగా కొంతసేపు కవిత బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ఉండటం విశేషం.
జ్యోతినగర్: పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి ఎమ్మెల్సీ కవిత పేరిట పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి బహుమానంగా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మల్కాపూర్‌కు చెందిన జిల్లాల మల్లయ్య, బానమ్మది పేద కుటుంబం. ఇల్లు కూడా లేదు. సంధ్యారాణి తన సొంత ఖర్చులతో వారికి ఇంటిని నిర్మించారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత బర్త్‌డే సందర్భంగా జడ్పీటీసీ దంపతులు గృహప్రవేశం జరిపించి మల్లయ్య దంపతులకు ఇంటిని కానుకగా ఇచ్చారు.