MLC Kavitha | ముఖ్యమంత్రి, మంత్రుల భద్రతను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం చూస్తుందని, ముప్పును బట్టి భద్రతను కేటాయిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాన్వాయ్‌ని భద్రతకు అనుగుణంగా ఎలా, ఎక్కడ తీర్చిదిద్దాలన్నది పోలీసులు ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారని, అవసరమైనప్పుడు తీసుకొచ్చి కాన్వాయ్‌ని వినియోగిస్తారన్నారు. భద్రత విషయంలో రాజకీయ నాయకుల పాత్ర ఉండదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో తనకు ఇంత భద్రత, అంత భద్రత ఉండాలని కేసీఆర్ కోరలేదని, పోలీసులే అవసరమైనంత భద్రత కల్పించారని ప్రస్తావించారు.
అయితే, దాన్ని పెద్ద అంశంగా చేసి వాహనాలను విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెటకారంగా మాట్లాడడం ఆయన గౌరవాన్నే తగ్గిస్తుందని అన్నారు. సీఎం వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. కాళేశ్వరం అంశంపై స్పందిస్తూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరిని ఇప్పటికే వెల్లడించిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం దర్యాప్తు నివేదిక రాకముందే మంత్రులు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సింగరేణి ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పార్టీ ఒక నిర్ణయం తీసుకుందన్నారు.
ఆ విషయాన్ని బాహాటంగానే ప్రకటించామని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ ఎదుగుదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆత్మప్రబోధానుసారం ఓట్లు వేయాలని తాము పిలుపునిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాన్ని కాకుండా సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీని కార్మికులు గెలిపించుకున్నారన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి టీబీజీకేఎస్ నాయకులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పోటీలో లేము కాబట్టే ఈ రకమైన ఫలితాలు వచ్చాయని, కానీ పోటీలో ఉండి ఓడిపోయినట్లు పలు పత్రికలు రాశాయని, పోటీ లేని వాళ్లం ఎలా ఓడిపోయారన్నది వాళ్లే ఆలోచించుకోవాలని సూచించారు.