హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసి, రాష్ట్రపతి ఆమోదానికి పంపిన బిల్లులను తర్వగా ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన ఆయన ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి చేస్తున్న బీసీ ఉద్యమం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడానికి చొరవ తీసుకోవాలని కోరుతూ కవిత వినతి పత్రం అందజేశారు. స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని కవిత పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ఆచారి, నేతలు రూప్సింగ్, మరిపల్లి మాధవి, మహేందర్ ముదిరాజ్, మనోజ్గౌడ్ పాల్గొన్నారు.