హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్దోషి అని ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు వాదించారు. మంగళవారమిక్కడ రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు.
ఈ సందర్భంగా కవిత కస్టడీ పొడిగింపుపై వాదనలు జరిగాయి. కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తన వాదనలు వినిపిస్తూ.. అప్రూవర్లు, సాక్షులు ఇచ్చిన వాం గ్మూలాన్ని పరిగణనలోకి తీసుకొని కవితపై సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేశాయని చెప్పారు. సెక్షన్ 50 పీఎంఎల్ఎ కింద సాక్షులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేశారని ఆరోపించారు. సాక్షులు, అప్రూవర్ల వాంగ్మూలాన్ని నమోదు చేసే సమయంలో చిత్రీకరించిన వీడియో, ఆడియోలను ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఈడీ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. శరత్ చంద్రారెడ్డితో కవితకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నదని, వారిద్దరికీ అనేక సంవత్సరాలుగా పరిచయం ఉన్నదని, ఆమెతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని మోహిత్‌రావు చెప్పారు. ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరిగాయని, దీంట్లో గోప్యత ఏమీ లేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది.