హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అసలు భారత్‌లోనే ఉన్నారా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను ఒక జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎవరైనా నేర్చుకోవచ్చునని అన్నారు.
సిరిసిల్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుని, రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గంలో వాటిని అమలుచేయవచ్చని సూచించారు. అయితే దేశం మొత్తం రాహుల్‌గాంధీ ఇప్పుడు ఎకడ ఉన్నారంటూ ఆశ్చర్యపోతున్నదని చురకలంటించారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు వస్తుంటే కేంద్రం నుంచి రాష్ర్టానికి సహాయం అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర రాష్ర్టాలకు మాదిరిగానే కేంద్రం తెలంగాణకూ వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు.