హైదరాబాద్: చంద్రయాన్-3 (Chandrayan-3) విజయవంతం చారిత్రాత్మకమైనదని, దేశం గర్వంతో ఉప్పొంగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha ) అన్నారు. చంద్ర మండలంపై తిరంగ జెండా రెపరెపలాడుతుందని తన సంతోషాన్ని ట్విటర్ వేదిక ద్వారా పంచుకున్నారు. విశ్వప్రయాణంలో అద్భుతమైన ఘట్టమని ఆమె పేర్కొన్నారు . చంద్రయాన్ 3తో సక్సెస్ ప్రతీ భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతుందని అన్నారు.
అద్భుత విజయం .. మంత్రి ఎర్రబెల్లి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతమవడం చరిత్రలో అత్యంత అద్భుత విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు. ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిందని పేర్కొన్నారు.
ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని విజయాలకు అంకురార్పణ జరిగిందన్నారు. ఇది భారత జాతి గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.