Abhishek Manu Singhvi | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఈడీ ఓ సామ్రాజ్యాధినేతగా వ్యవహరిస్తున్నదని, తనకు సూపర్‌పవర్ ఉన్నట్టుగా భావిస్తున్నదని, విలువలకు వలువలు లేకుండా చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం కవిత బెయిల్ పిటిషన్‌పై జరిగిన విచారణలో ఆమె తరఫున సింఘ్వీతోపాటు నితీశ్ రాణా వాదనలు వినిపించారు. దేశం, న్యాయస్థానాలు, రాజ్యాంగాలకు అతీతంగా ఈడీ వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఒక కట్టుబాటు, కోర్టులకు ఇచ్చిన మాటకు విలువ ఇవ్వడం వంటివి ఈడీకి తెలియదని అన్నారు. విలువలకు తిలోదకాలిచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టులో కవితపై ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోమని ఈడీ హామీ ఇచ్చి, ఆ తర్వాత కవితను అరెస్టు చేసిందంటే మాటకు ఎంత విలువ ఇస్తున్నదో అర్థమవుతున్నదని అన్నారు. కవిత పిటిషన్‌పై గత నెల 15న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన రోజే ఈడీ అరెస్టు చేసిందని తెలిపారు. అంత హడావుడిగా అరెస్టు చేయాల్సిన అత్యవసరం ఈడీ ఎందుకు వచ్చిందో అలోచన చేయాలని అన్నారు. ఈడీ దర్యాప్తు సంస్థ మాదిరిగా వ్యవహరించడం లేదని, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీగా కాకుండా, పీడించే సంస్థగా మారిందని చెప్పారు. కేసు దర్యాప్తు ఏమాత్రం నిష్పక్షపాతంగా జరగడం లేదని తెలిపారు. న్యాయబద్ధంగా వ్యవరించడమే లేదన్నారు. ఈడీ దర్యాప్తు పిల్లి ఎలుక ఆటలా (టాం అండ్ జెర్రీ)లా ఉందని చెప్పారు. ఈడీ దర్యాప్తునకు కవిత సంపూర్ణంగా సహకరించారని, అయినా కావాలని అరెస్టు చేసిందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒకటంటే ఒక సాక్ష్యం కూడా ఈడీ సాధించలేదని చెప్పారు. కేవలం అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆమెను తప్పుగా కేసులో ఇరికించారని తెలిపారు.
కవిత అరెస్టు అక్రమం
‘మద్యం కేసు నిందితుడు అరుణ్ రామచంద్ర పిైళ్లె నుంచి ఈడీ మొత్తం 10 వాంగ్మూలాలు నమోదు చేసింది. అందులో తొమ్మిది స్టేట్మెంట్స్లో కవిత పేరు పిైళ్లె చెప్పలేదు. చివరిదైన పదో స్టేట్మెంట్లోనే కవిత పేరు చెప్పినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ స్టేట్మెంట్ను ఆయన ఉపసంహరించుకున్నారు. వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది?’ అని సింఘ్వీ ప్రశ్నించారు. దీనిని బట్టి కవిత అరెస్టే అక్రమమని స్పష్టం అవుతున్నదని తెలిపారు. ఇదే మాదిరిగా 2022లో సుమారు 18 నెలల క్రితం ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందని, కవితను అరెస్టు చేసేందుకు ఈడీ దగ్గర సరైన కారణం లేదని చెప్పారు. ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవశ్యకతను ఈడీ చూపించలేకపోయిందని అన్నారు. ఈడీ సమర్పించిన అనుబంధ చార్జిషీట్లలో కూడా కవిత నిందితురాలిగా లేదని గుర్తుచేశారు. ఈడీ సమన్లు జారీచేసిన ప్రతిసారీ కవిత సహకరించారని, ఇప్పుడు సహరిస్తున్నారని బెయిల్ మంజూరు చేయండని సింఘ్వీ విజ్ఞప్తిచేశారు. ఈడీ తరపు జోహెబ్ హుస్సేన్ వాదిస్తూ.. రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయని అన్నారు. దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఈ నెల 4న మధ్యాహ్నం 2.30 గంటలకు జరుపుతామని కోర్టు ప్రకటించింది. తదుపరి విచారణలోగా కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ పిటిషన్ వేయాలని నోటీసులు జారీచేసింది.
కవితకు అన్ని వసతులు కల్పించాలి
జైలులో కవితకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జైలు అధికారులకు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేసింది. జైలులో కవితకు అవసరమైన కొన్ని వస్తువులను అనుమతించాలని కోరుతూ ఆమె తరఫు మరో న్యాయవాది నితీశ్ రాణా సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆమె కోరిన విధంగా మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కుకింగ్ ఆఫ్ బుక్స్, 365 సుడోకు, జయ గోష, మురకమి నార్వింగ్ వుడ్, ది ఆర్ఎస్ఎస్ రోడ్‌మ్యాప్స్ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం, ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్, లివింగ్ ఇన్ ద లైట్ అండ్ పేపర్ క్లబ్, నోట్‌బుక్స్ తదితరమైన వాటిని అనుమతించాలని న్యాయస్థానం స్పష్టంచేసింది. నిబంధనలకు అనుగుణంగా ఇంటినుంచి ఆహారం, పుస్తకాలు, పరుపులు, స్లిప్పర్స్, దుప్పట్లు తెచ్చునేందుకు అనుమతించాలని మరోసారి ఆదేశించింది. గత నెల 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒకటీ అనుమతించడంలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టు ఉత్తర్వుల్లో పేరొన్న అన్నింటినీ అనుమతించినట్టు జైలు సూపరింటెండెంట్ కోర్టుకు తెలిపారు. దీంతో ఈసారి కోర్టు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీచేసింది.