హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మికలోకానికి పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని కోరారు. గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కార్మికులకు శుభాకాంక్షలు తెలిపి.. పలు కార్మిక సంఘాల నాయకులను సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. వీటి రద్దుకోసం సంఘటితంగా ఉద్యమించాలని ఉద్బోధించారు.
భూమి లేనివారిని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు. పనుల్లో పురుషులతో మహిళలు పోటీ పడుతున్నారని, వేతనాల్లో వ్యత్సాసం ఉండకూడదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూప్సింగ్, అంగన్వాడీ, ఆశ, వీఏవో యూనియన్ల రాష్ట్ర అధ్యక్షురాళ్లు ఆడెపు వరలక్ష్మి, సంతోషి, మాధవి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, శ్రీనివాస్, నారాయణ, మిట్టపల్లి సురేందర్, సందీప్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర, మే 1: బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరో సా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పిండి యాకయ్య ఇటీవల మృతి చెందాడు. గురువారం బాధిత కుటుంబానికి పార్టీ బీమా రూ.2లక్షల చెకును దయాకర్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ముందుచూపుతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దేశంలోనే మొదటిసారిగా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా బీమాను కల్పించినట్టు తెలిపారు.