Telangana | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విచారణను ఆరో తేదీన నిర్వహిస్తున్నట్టు షెడ్యూల్ విడుదల చేశారు. ఏడో తేదీన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ విచారణకు హాజరుకానున్నారు. 12వ తేదీన తిరిగి ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్, 13వ తేదీన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక్కో ఎమ్మెల్యేకు సంబంధించి పిటిషనర్ తరఫున ఒకరోజు, ఫిరాయింపు ఎమ్మెల్యే తరఫున ఒకరోజు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే తొలి దశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తయింది.
వచ్చే సమావేశాలనాటికి మండలి భవన పునర్నిర్మాణ పనులు పూర్తి
రాబోయే శాసనసభ సమావేశాల నాటికి శాసనసభ భవనం ఆవరణలోని పాత భవన పునర్నిర్మాణ పనులు పూర్తిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన శాసనసభలోని పాత శాసనసభ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న శాసనసభ ఆవరణలోనే పాత భవనం ఉన్నందున దీని పునర్నిర్మాణం పూర్తిచేస్తే రాబోయే శాసనసభ, మండలి సమావేశాలను ఒకే దగ్గర నిర్వహించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పునర్నిర్మాణం పూర్తిచేసుకున్న శాసనమండలి భవన నిర్మాణ ప్రారంభోత్సవాన్ని అతిత్వరలోనే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని, నిర్మాణ పనుల పురోగతి గురించి కూడా సీఎం వాకబు చేశారని గుత్తా వెల్లడించారు. పునర్ నిర్మాణ పనులను ఆర్అండ్బీ శాఖ, ఆగాఖాన్ ట్రస్టులు పూర్తిచేసి శాసనసభ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు.
కడియం, దానంలకు నోటీసులు ఎప్పుడు?
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇప్పటి వరకు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, కీలకమైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. వారికి స్పీకర్ నోటీసులు ఇచ్చారా? వారు సమాధానాలు ఇచ్చారా? లేదా? అన్నదానిపైనా స్పష్టత లేదు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు స్పష్టమైన ఆధారాలున్న నేపథ్యంలో వారే తమ పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.