కడెం, జూలై 28: ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ గురువారం సాహస యాత్ర సాగించారు. తెప్ప, ఎడ్లబండిపై ఉధృత వాగులు దాటారు. వర్షంలో తడుస్తూ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. స్థానికులతో సమావేశమై ఆదుకొంటామని భరోసా ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది నుంచి కడెం వాగు వద్దకు ఎమ్మెల్యే రేఖానాయక్ మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకొన్నారు. భారీ వరదలకు అక్కడ నిర్మిస్తున్న వంతెన కూలిపోవడంతో వర్షంలో తడుస్తూనే తెప్పపై గంగాపూర్ వాగు దాటారు. ఆ తర్వాత ఎడ్లబండిపై మరో వాగును దాటి గ్రామానికి చేరుకొన్నారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. గంగాపూర్లో రాణిగూడ, బాబానాయక్ తండా, అల్లంపల్లి, మీసాల భూమన్న గూడం తదితర గ్రామాల ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వంతెన లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. గంగాపూర్ వంతెన రీ డిజైన్ చేసి పనులు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీఇచ్చారు. సాహసం చేసి వాగులు.. వంకలు దాటి వచ్చిన ఆమెను ప్రజలు సన్మానించారు.