పిట్లం, జనవరి 29: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే దాకా ఆ పార్టీని వదిలిపెట్టకుండా వెంటాడుతామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా రాష్ట్రంలోని 17 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు, అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని మాత్రమే అమలు చేసి, మిగిలిన వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలంటే ఏటా రూ.4 లక్షల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఇదేదీ ఆలోచించకుండా అలవికాని హామీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేసీఆర్ అధికారంలో ఉంటే యాసంగి పెట్టుబడి సాయం ఇప్పటికే రైతులు అందరికీ అందించే వారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.