రామగిరి, జూన్ 20: సమాజ సేవతోపాటు ఉద్యోగార్థులకు అండగా నిలిచి ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించాలన్న మంత్రి కేటీఆర్ సూచన మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో చదువుకొంటున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే బాసటగా నిలిచారు. కంచర్ల మానస ఫౌండేషన్ ద్వారా నల్లగొండలోని భవిత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు.
నల్లగొండలోని కొత్త టీఆర్ఎస్ కార్యాలయం వేదికగా రెండువేల మందికి ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కోచింగ్ అందిస్తున్నారు. గ్రూప్ 2, 3, 4తోపాటు ఎస్సై, కానిస్టేబుల్, డీఎస్సీ ఉద్యోగాలకు నిపుణులైన అధ్యాపకులతో 70 రోజులుగా విజయవంతంగా శిక్షణ కొనసాగుతున్నది. అభ్యర్థులకు స్నాక్స్తోపాటు మినరల్ వాటర్ అందిస్తున్నారు. ఎమ్మెల్యే సహకారంతో భవిత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి ఉద్యోగార్థులకు స్టడీమెటీరియల్ ఇస్తున్నారు.