హైదరాబాద్, సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ) : ‘ఆరేడేండ్లుగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నం.. ఈ ఏడాది కూడా మా సర్వీసులను కొనసాగిస్తూ జూన్‌లోనే సెక్రటరీ ఉత్తర్వులిచ్చిండ్రు.. అనేక చోట్ల భారీగా ఖాళీలున్నా మమ్మల్ని అర్ధాంతరంగా విద్యాసంవత్సరం మధ్యలో రాత్రికి రాత్రే తొలగించడంలో ఆంతర్యమేమిటి?..వుయ్ వాంట్ జస్టిస్.. మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి.. మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి’ అంటూ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీల్లోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లు, నాన్ సీవోఈలు, ప్రత్యేక, వొకేషనల్ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు, ఫిజికల్ డైరెక్టర్లు డిమాండ్ చేశారు. తమను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సొసైటీ తక్షణం వెనక్కి తీసుకోవాలని నినదించారు.
ఎస్సీ గురుకులాల్లోని పార్ట్‌టైం సిబ్బందిని తొలగిస్తూ సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ వారంతా మాసబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్‌కు బుధవారం భారీగా తరలివచ్చారు. సొసైటీ గేటు ఎదుట ధర్నాకు దిగారు. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, సెక్రటరీని వెంటనే తొలగించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది మాట్లాడుతూ తాము రెగ్యులర్ ఉపాధ్యాయలతో సమానంగా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. గత సెక్రటరీలతో ఎన్నడూ తమకు ఇబ్బంది రాలేదని, తమ శ్రమను గుర్తించి అభినందించారు తప్ప ఎప్పుడూ చేటు చేయలేదని వివరించారు. ప్రస్తుత సెక్రటరీ వచ్చాకే తమకు కష్టాలు మొదలయ్యాయని, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వాపోయారు.
ఈ ఏడాది కూడా తమ సర్వీసులను కొనసాగిస్తూ జూన్‌లోనే సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి ఉత్తర్వులిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు మైనార్టీ, ఎంజేపీ, ట్రైబల్ ఇలా ఏ గురుకుల సొసైటీలో లేనివిధంగా కేవలం సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలోనే పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీలను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు. రెగ్యులర్ స్టాఫ్ వస్తున్నారని సెక్రటరీ చెబుతున్నా గురుకులాల్లో అనేక చోట్ల భారీగా ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అయినా తమను అర్ధాంతరంగా, విద్యాసంవత్సరం మధ్యలో రాత్రికి రాత్రే తొలగించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండి గెలిపించుకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని వాపోయారు. సెక్రటరీ నిర్ణయం వల్లే తమ కుటుంబాలు రోడ్డు పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సొసైటీ గేటుకు తాళం
తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్ట్‌టైం, గెస్ట్‌ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు, ఫిజికల్ డైరెక్టర్లు ఉదయం నుంచి డీఎస్ఎస్ భవన్ ఎదుట ధర్నా చేస్తున్నా సోషల్వెల్ఫేర్ సెక్రటరీ వర్షిణి, సొసైటీ ఉన్నతాధికారులెవరూ స్పందించలేదు. అదీగాక పోలీసులకు సమాచారమిచ్చి వారిద్వారా సదరు సిబ్బంది ఎవరూ సొసైటీ కార్యాలయం లోనికి రాకుం డా గేటు వద్దే అడ్డగించారు. సొసైటీ గేట్లకు సైతం తాళం వేళారు. అయినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సొసైటీ అధికారులు ఓ ఐదుగురిని లోపలికి పిలిపించుకున్నారు. సెక్రటరీ వచ్చి మాట్లాడతారని చెప్పి దాదాపు అరగంట సేపు వెయిట్ చేయించారు. వారు అక్కడ కూర్చుని ఉన్నా.. భవన్ ఎదుట ధర్నా కొనసాగుతున్నా ఆదేమీ పట్టించుకోకుండా మళ్లీ వస్తానని చెప్పి గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి మరో గేటు ద్వారా వెళ్లిపోయారు. దీంతో పార్ట్‌టైం సిబ్బంది మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా? అంటూ నిప్పులు చెరిగారు. అక్కడి నుంచి నేరుగా మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యా దు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఒక్క డీఎస్ఎస్ భవన్ వద్దే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆయా జోనల్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు.
సిబ్బందిని కొనసాగించాలి: కొప్పుల
కరీంనగర్ కార్పొరేషన్: గురుకుల పాఠశాలల గెస్ట్, పార్ట్ టైం ఉద్యోగులను కొనసాగించాల్సిందేనని, వారిని తీసేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఓ ప్రకటన హెచ్చరించారు. ఓవైపు సరైన వసతులు కరువై గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే, విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నపలంగా టీచర్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాతవారిని తొలగించి, కొత్తవారి వద్ద రూ.50వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ఉన్నతాధికారులు అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో దాదాపు 2లక్షల మంది ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని విచారం వ్యక్తం చేశారు.
గద్వాలలో నిరసన
గద్వాల: తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట గురుకులాల పార్ట్ టైం టీచర్లు, గెస్ట్ ఫ్యాక్టల్టీ, పీఈటీలు బుధవారం ఆందోళన చేపట్టారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న తమను అకస్మాత్తుగా తొలగించడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు నెలల జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు.
తొలగింపు అప్రజాస్వామికం : ఏఐవైఎఫ్
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో పనిచేస్తున్న 6 వేల మంది పార్ట్‌టైమ్ టీచర్లను, 33 సీఓఈల్లో పనిచేస్తున్న 216 సబ్జెక్ట్ అసోసియేట్ టీచర్లను తొలగించడం దారుణమని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్? ; మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
హైదరాబాద్: ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల తొలగింపు అంశంపై మాజీ మం త్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాలు కోల్పోయిన పలువురు హరీశ్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకోగా ఆయ న వెంటనే స్పందించారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీఈవోలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సెప్టెంబర్ 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం టీచర్లకు అదనపు ప్రోత్సాహకా లు అందిచడం ఆనవాయితీ అని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యాబుద్ధులు నేర్పే గురువులను అర్ధాంతరంగా తొలగించి వారి కి, వారి కుటుంబాలకు అంతులేని క్షోభను కలిగించిందని నిప్పులు చెరిగారు. 3నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, అడిగిన పాపానికి ఏకంగా వారిని ఉద్యోగాల నుంచే తొలగించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ఐఐటీ, ఎన్ఐటీ కోచింగ్‌ను పునరుద్ధరించాలని, తొలగించిన పార్ట్ టైమ్ లెక్చరర్లు, టీచర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వారినే విధుల్లోకి తీసుకుంటాం.. ;‘నమస్తే’ కథనంతో సెక్రటరీ ప్రకటన తాత్కాలికంగా పక్కన పెట్టామని వివరణ
హైదరాబాద్: తొలగించిన ఉద్యోగులనే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి ప్రకటించారు. సొసైటీ ఉత్తర్వులపై ‘గురుకుల గెస్ట్ లెక్చరర్లు వెయ్యిమందిపై వేటు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల గురుకుల సొసైటీ కొత్తగా రెగ్యులర్ ఉద్యోగుల నియామకాలను చేపట్టిందని, బదిలీలు కూడా నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పార్ట్‌టైం, గౌరవవేతనంపై పనిచేస్తున్న నాన్ రెగ్యులర్ సిబ్బందిని తాత్కాలికంగా తొలగించామని వెల్లడించారు. గురుకులాల్లో మిగిలిన ఖాళీల వివరాలను ప్రిన్సిపాళ్ల నుంచి తెప్పించుకొని, అవసరాల మేరకు తిరిగి నాన్ రెగ్యులర్ ఉద్యోగులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అంతేగాని పూర్తిగా తొలగిస్తున్నట్టు ఆదేశాలివ్వలేదని స్పష్టం చేశారు.