సంగారెడ్డి : ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు చోటు లేదు. రెండుసార్లు చీకొట్టినా కాంగ్రెస్ నాయకుడు కాటా శ్రీనివాస్‌కు బుద్ధి రాలేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy) మండిపడ్డారు. పటాన్చెరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అన్నదే మా ప్రధాన ఆలోచన. కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఇకనైనా బుద్ధి మార్చుకో.. లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. చేతులకు గాజులు పెట్టుకొని కూర్చోలేదు. ఘటనలు పునరావృతం అయితే ప్రతిఘటన తప్పదన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ఓడినా కాటా శ్రీనివాస్ గౌడ్ కు(Kata Srinivas Goud) కనీసం సిగ్గు లేదని ఘాటుగా విమర్శించారు.
పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే ఇళ్లు లాంటిది. దానిపై దాడి చేయటం దారుణం. కొందరు చీప్ మెంటాలిటితో పని చేస్తున్నారు. క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
కాగా, పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గంలోని ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బూతులు తిట్టారని ఆరోపిస్తూ సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్చెరు స్లోగన్‌తో స్థానిక కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న కుర్చీలను పగలకొట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పాత, కొత్త నేతల పంచాయితీ సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పటాన్చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులను మోరించారు.