బెల్లంపల్లి, ఆగస్టు 21 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏలు, కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై మద్యం మత్తులో డ్యాన్సులు చేసిన వీడియో సోషల్ మీడియాలో గురువారం చక్కర్లు కొట్టింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధికార పీఏ రామకృష్ణ, అనధికార పీఏ గడ్డం ప్రసాద్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు రమేశ్, శ్యాం, డ్రై వర్లు మోసిన్, శేఖర్ బెల్లంపల్లిలోని కెమికల్ ఏరియా వద్ద జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి కారులో పాటలు పెట్టుకుని మద్యం తాగుతూ కేకలు వేస్తూ చిందులు వేశారు.
బాధ్యతాయుతమైన పీఏ పదవిలో ఉండి ఇలా రోడ్లపై డ్యా న్సులు చేస్తూ వాహనదారులను ఇబ్బంది పెట్టడంపై పట్టణవాసులు సోషల్‌మీడియాలో తిట్ల వర్షం కురిపించారు. సమీప బంధువు, సన్నిహితుడు కావడంతోనే పీఏను మందలించి వదిలివేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించవద్దని ప్రకటనలు గుప్పించి సామాన్య జనంపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.