భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 12 : ఉపాధి కోసం 30 ఏండ్ల క్రితం ముంబై వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ జరిగిన గొడవలో గాయపడ్డాడు. ఫలితంగా ఇక్కడి విషయాలు మర్చిపోయాడు. తాజాగా తన కుటుంబం గుర్తుకు రావడంతో మంగళవారం ఇంటికి చేరుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీవనపల్లికి చెందిన మీసాల రాములు ఉపాధి కోసం 30 ఏండ్ల క్రితం (ఆ సమయంలో అతనికి 30 ఏండ్లు) ముంబై వెళ్ల్లాడు. అప్పటికే ఆయనకు పెంటమ్మ అనే మహిళతో పెండ్లి కాగా కుమారుడు, కూతురు ఉన్నారు. ముంబైలో జరిగిన ఓ గొడవలో రాములు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో అన్ని విషయాలు మర్చిపోయాడు. ఆరోగ్యం మె రుగుపడినా గత జ్ఞాపకాలు గుర్తుకురాలేదు. ముంబై వెళ్లిన రాములు ఆచూకీ దొరక్క పోవడంతో వెతకడం మానేశారు. ఈ క్రమంలో రాములు అక్కడే ఓ మహిళను వివాహం చేసుకోగా కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం పాత విషయాలు గుర్తుకురావడంతో రాములు మంగళవారం తన స్వగ్రామమైన భీవనపల్లికి తిరిగి వచ్చాడు. ఎట్టకేలకు రాములు రాకతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.