Banjaras | తాగ్యానికి మారుపేరు సంత్ సేవాలాల్ మహరాజ్ (Sant Sevalal Maharaj) అని, బంజారాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక సప్తగిరి కాలనీలో సేవాలాల్ మహరాజ్ మందిర స్థలంలో నిర్వహించిన ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ సేవలను కొనియాడారు. దేశం కోసం బంజారాలు ప్రాణత్యాగాలు చేశారన్నారు.
సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జంతుహింస వద్దని, హిందూధర్మం కోసం దేశమంతా ప్రచారం చేసిన మహనీయుడని కొనియాడారు. మహరాజ్ మందిరం, భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.30లక్షలు కేటాయించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొసీడింగ్స్‌ను బంజారా నేతలకు మంత్రి అందజేశారు. ఇంకా అవసరమైతే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, కార్పొరేటర్ దిండిగాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.