నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 10: బహుజన వర్గాల స్ఫూర్తిప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరై నివాళి అర్పించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ సాధించామని పలువురు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని ధర్నాచౌక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నివాళి అర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రజాకార్లపై ఎదురు తిరిగిన ధీరురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి గుర్తుచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపులో హోంమంత్రి మహమూద్ అలీ.. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి చాకలి ఐలమ్మకు నివాళి అర్పించారు. ఐలమ్మ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం ఐడీఏలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు..మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
తెలంగాణలో భూస్వాములపై తిరగబడిన తొలి వీరవనిత ఐలమ్మ అని మంత్రి కొనియాడారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఎంపీ సంతోష్‌కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నివాళి అర్పించారు. బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన పోరాటయోధురాలు ఐలమ్మ అని ఎర్రబెల్లి కొనియాడారు.
మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా సమీపంలో ఐలమ్మ చిత్రపటం వద్ద మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నివాళులర్పించారు. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాట పటిమను భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాటయోధురాలు అని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో రజక సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ఐలమ్మ విగ్రహానికి నివాళి అర్పించారు. నాడు రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ధీరవనిత ఐలమ్మ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు.