హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. నిలబెట్టారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మేడారంలో ఆదివారం ఆర్టీసీ క్యూలైన్లు, భద్రత నిరంతర నిఘా కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డితో కలిసి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
మేడారంలో గత జాతరలో ఆర్టీసీ ద్వారా 19 లక్షల మంది ప్రయాణం చేస్తే.. ఈ సారి మరో రెండు లక్షలు అదనంగా కలిపి 21 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మేడారంలో ఆర్టీసీ సేవల కోసం 12వేల మంది సిబ్బంది పనిచేస్తుండడం అనేది చాలా గొప్ప విషయమన్నారు.
ఆర్టీసీతో పాటు పోలీసు, పారిశుధ్యం, వైద్యం, ఇతర శాఖల సిబ్బంది కలిపి దాదాపు 40వేల మంది సిబ్బంది అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చే భక్తులకు వసతులు కల్పించడం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. భక్తులు కూడా ప్రభుత్వానికి సహకరించి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.