Minister Hairsh Rao | తెలంగాణ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ మోదీకి ఉంటుందా?.. ఆయనకు ఎప్పటికైనా గుజరాత్‌పైనే ఉంటుందని అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అన్ని పథకాలు అక్కడికి తీసుకెళ్లారని, ఎవరో ఏదో మాట్లాడరని ఆగం కావదన్నారు. సిద్ధిపేట జిల్లా దూల్మిట్టలో రూ.1.10కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సక్సెస్ ఫుల్ రాజకీయ నాయకుల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు అని, ఆయన తిరగని ఊరులేదన్నారు. గ్రామానికి నిధులు, పనులు సాధించడంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి పట్టుదల ముఖ్యమైందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏకపక్షంగా కేసీఆర్ నాయకత్వాన్ని, ఉద్యమాన్ని బలపరిచిన గ్రామన్నారు.
ఈ గ్రామానికి నేడు రూ.1.10కోట్ల పనులు మంజూరు చేసుకొని శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు. ‘మన ఊరు – మన బడి’ కింద రూ.70లక్షలు మంజూరు చేశామని, అవసరమైనన్ని కేటాయిస్తామన్నారు. ఘనమైన చరిత్ర చేర్యాల పాఠశాలకు ఉందని, ఇక్కడ చదువుకున్న వాళ్లంత గొప్పవాళ్లయ్యారన్నారు. చేర్యాలలో వైద్యం, సాగునీరు, రోడ్లు, విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచుల పరిస్థితి మనకు తెలియంది కాదన్నారు. ఆ రోజున కాలిపోయే మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, బోర్ల బొక్కలకు సర్పంచుల నిధులు సరిపోయేవని, సర్పంచులు దిగిపోయే నాటికి అప్పులు మిగిలేవన్నారు.
తెలంగాణ అభివృద్ధిని బీజేపీ నేతలకు ఓర్వలేకపోతున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ పథకాలను కాపీ కొడుతూ మెచ్చుకుంటున్నారని, అవార్డులు ఇస్తూ.. గల్లీలో వచ్చి తిడుతున్నారన్నారు. వీళ్లు చేసింది తెలంగాణ ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణలో పండిన వడ్లు ఎంత? ఈ రోజు పండిన వడ్లు ఎంత? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టింది..
కరెంట్ కోతలతో కష్ట పడింది మర్చిపోయామా? అన్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలను చూసి రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే మాకు ఇలాంటి పథకాలు అమలు చేయాలని, లేకపోతే తెలంగాణలో కలపండి అంటున్నారని గుర్తు చేశారు. మహరాష్ట్ర వాళ్లు అలాగే కోరుతున్నారన్నారు. వారి కంటే మంచి పనితనం మన దగ్గర ఉండడం వల్లే కదా తెలంగాణ పథకాలు కావాలి, తెలంగాణలో కలపాలి అని అడుగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.40వేల కోట్ల నిధులు ఆపి ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నారు.
పొరుగు రాష్ట్రాల్లో మాకు సరిపోయే ధాన్యం అందడం లేదు.. ధాన్యం కావాలని అడుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దక్షిణ భారతదేశ ధాన్యాగారం అయ్యిందని, పది మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ మన రాష్ట్రం అయ్యిందని, ఇదంతా రాత్రికిరాత్రి అయ్యింది కాదన్నారు. సీఎం కేసీఆర్ మెదడు కరిగించి కాళేశ్వరం, దేవాదుల కట్టడం వల్ల నీళ్లు వస్తున్నాయని, 200 రోజులు వచ్చి పంటలు డుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ ప్రేమ తల్లి ప్రేమ అని, కేంద్ర ప్రభుత్వ ప్రేమ సవతి తల్లి ప్రేమ అన్నారు.
బీఆర్ఎస్ ఎంత ఎదిగితే.. మనకు అంత మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ ఎదుగుదల అంటే తెలంగాణ ఎదుగుదల అన్నారు. తెలంగాణలో నేడు కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నామన్నారు. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేడు రూ.11 కోట్లతో చేర్యాలలో హాస్పిటల్ కడుతున్నామన్నారు. జనగామలో మెడికల్ కాలేజీ కల అని, అవన్నీ నిజం చేసుకున్నామన్నారు.
దూల్మిట్టకు రుణపడి ఉంటామని, శక్తి మేర ఈ ప్రాంత అభివృద్ధికి పని చేస్తాం అన్నారు.
చేర్యాల జనగామలో ఉన్నపుడు నాకు సంబంధాలు బాగుండేవన్నారు. ఇప్పుడు హరీశ్ పరిధిలోకి వెళ్లిందన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాకముందు, వచ్చిన తరవాత తేడా చూడాలని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏమి జరుగుతుంది అనేది సమీక్ష చేసుకోవాలన్నారు. ఈ ప్రాంతానికి అప్పట్లో కుండలు, బిందలతో వచ్చి నీళ్ళు అడిగే వాళ్లని, చెరువుల్లో నీరు ఉండేది కాదని, ఘోరమైన కరువు ఉండేదన్నారు. కరెంట్ ఉండక పోయేదని, రైతుల పరిస్థితి.. నాటికి నేటికి ఎంత మారింది గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలన్నారు. బీజేపీ మూర్ఖులు ఎన్నో మాట్లాడుతున్నారని, ఆ పార్టీ పాలించే రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు లేదని, పెన్షన్లు లేవన్నారు. సీఎం కేసీఆర్‌కు చేర్యాలపై ప్రేమ ఉందని, హరీశ్‌రావు తన జిల్లాలో కలుపుకున్నారన్నారు. అందుకే ఇంత అభివృద్ధి జరుగుతుందని, తిగుళ్ల కృష్ణమూర్తి ఈ ఊరి బిడ్డ కావడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.