కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ (Orient Cement Company) గుర్తింపు సంఘం ఎన్నికల్లో మంత్రి గడ్డం వివేక్ ( Minister Gaddam Vivek ) , ఎమ్మెల్యే గడ్డం వినోద్ ( MLA Gaddam Vinod ) కు ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో 33 ఓట్ల మెజార్టీతో కొక్కిరాల సత్యపాల్ రావు ఘన విజయం సాధించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగింది.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. కంపెనీలో మొత్తం 266 మంది కార్మికులు ఉండగా 256 మంది నేరుగా, 9 ఓట్లు సీల్డ్ కవర్ ఓటింగ్ ద్వారా ఓట్లు వేశారు. అనంతరం సాయంత్రం తరువాత జరిగిన ఓట్లను లెక్కించారు. దీనిలో 9 ఓట్లు సీల్డ్ కవర్ ఓట్లు కావడంతో వాటిని లెక్కించలేదు. పోలైన 256 ఓట్లను లెక్కించారు. దీనిలో కొక్కిరాల సత్యపాల్ రావుకు 141 ఓట్లు , ప్రత్యర్థి అభ్యర్థి పూస్కూరి విక్రంరావు కు 108 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి తట్ర భీంరావుకు 6 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లని ఓటుగా నమోదైంది. 33 ఓట్ల మెజార్టీతో కొక్కిరాల సత్యపాల్ రావు ఘన విజయం సాధించారు.
ఎన్నికల అనంతరం దేవాపూర్‌లో సత్యపాల్ రావు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో గడ్డం బ్రదర్స్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిలబెట్టిన అభ్యర్థి పూస్కూరి విక్రం రావుపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సోదరుడు కొక్కిరాల సత్య పాల్ రావు గెలుపొందారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వయంగా తిరగడంతో పాటు మంత్రి తన బలగాన్ని మొత్తం దించినా అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు.