e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home Top Slides కృష్ణా నీటి మళ్లింపులో వైఎస్‌ దొంగ.. జగన్‌ గజదొంగ

కృష్ణా నీటి మళ్లింపులో వైఎస్‌ దొంగ.. జగన్‌ గజదొంగ

  • సీమ లిఫ్ట్‌, ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ పనులు ఆపాలి
  • అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం
  • లేదంటే ప్రజాయుద్ధం తప్పదు: మంత్రి వేముల

మహబూబ్‌నగర్‌, జూన్‌ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జల చౌర్యంలో వైఎస్సార్‌ దొంగ అయితే ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గజదొంగ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా జగన్‌ రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులు చేపట్టారని, గతంలో ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు నిర్మించి కృష్ణానీటిని తరలించుకుపోయారని మండిపడ్డారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి (కేసీఆర్‌ నగర్‌)లో 1,024 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి వేముల ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేముల మాట్లాడారు.

తెలంగాణ బద్ధవ్యతిరేకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా 40 వేల క్యూసెక్కులు దోచుకుపోయారని.. దీనికి నిరసనగా అప్పటి కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మన నీళ్లను తరలించుకు పోతున్నప్పటికీ జిల్లాకు చెందిన అప్పటి మహిళా కాంగ్రెస్‌ మంత్రి వైఎస్సార్‌కు హారతులు పట్టారన్నారు. కేవలం 1,500 క్యూసెక్కులకు అనుమతి ఉంటే 40 వేల క్యూసెక్కులను అక్రమంగా తరలించుకుపోయేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణమని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్‌ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నాడని, ఆర్డీఎస్‌ కుడి కాల్వ ద్వారా నీటి చౌర్యానికి ప్రాజెక్టులు కడుతున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము పనులు చేపట్టడం లేదంటూ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు లేఖలు రాస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

దొంగ, గజ దొంగ చర్యలను ఖండించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. రాయలసీమ, ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ పనులను ఇప్పటికైనా నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజాయుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు సొంత స్థలం ఉంటే డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని మంత్రి వేముల తెలిపారు. దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ కంటే ఒక్క రూపాయి ఎక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారని నిరూపిస్తే తనతోపాటు శ్రీనివాస్‌గౌడ్‌ కూడా మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని వేముల సవాల్‌ విసిరారు.

అన్యాయాన్ని కేసీఆర్‌ సహించరు: శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరుకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్‌ సహించరని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఏం చేయాలో సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కలిసికట్టుగా నిలిచి ఆంధ్రా ఎత్తులను చిత్తు చేస్తామని హెచ్చరించారు. పేదలందరికీ దశల వారీగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన బైపాస్‌ రోడ్డును మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement