హైదరాబాద్ : బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ బాలుడి వైద్య ఖర్చులకు ఎల్ఓసీ అందించి అండగా నిలిచారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నగరంలోని చంపాపేట్‌కు చెందిన జంగయ్య – యశోద దంపతుల కుమారుడు శివజేత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో శివతేజ్ను నిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షల్లో శివతేజ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. చికిత్సకు రూ.5లక్షల వరకు ఖర్చవుతుందని, వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన మంత్రి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2.50లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఇవాళ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసంలో బాలుడి కుటుంబానికి ఎల్ఓసీని మంత్రి అందజేశారు.