హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చెంది తాగు, సాగునీటి సమస్య పరిష్కారమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. దశాబ్ది ఉత్సవాల(Decade Celebrations)లో భాగంగా గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని లోటస్ పాండ్ లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేని కారణంగా పూడిపోవడం, ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. వీటిని పరిరక్షించి వాటికి పూర్వవైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Chief Minister KCR) నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలు వృద్ధి చెందాయని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ(Mission Kakatiya) కార్యక్రమం క్రింద రాష్ట్రంలో ఉన్న 46,623 చెరువు కట్టలను పటిష్టపర్చడం, తూములు, కాలువల మరమ్మతులు వంటి అభివృద్ధి చేపట్టారని తెలిపారు. దీంతో నేడు చెరువులు నిండుగా నీటితో కళకళ లాడుతున్నాయని వివరించారు. చెరువుల అభివృద్ధి తో పాటు పరిసరాలు ఎంతో సుందరంగా మారి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని అన్నారు. నూతన రిజర్వాయర్ ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణంతో గణనీయంగా భూగర్బ జలాలు పెరిగాయని, తద్వారా సాగుభూమి విస్తీర్ణం పెరిగి పంటల దిగుబడి భారీగా పెరిగిందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేయడం వలన అటు మత్స్యకారులు, సమృద్ధిగా సాగునీటి లభ్యతతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. అనంతరం దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రూపొందించిన పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు మన్నే కవిత, సంగీత, వెంకటేష్, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ప్రసన్న, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఆర్డీవో వసంత, సీఈ సురేష్ అధికారులు పాల్గొన్నారు.