హైదరాబాద్: రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం పర్యాటక శాఖ చేపట్టిన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అధికారులను ఆదేశించారు. సీఎం కప్లో (CM Cup) భాగంగా క్రికెట్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాసనసభ ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో తెలంగాణ టూరిజం, క్రీడా, యువజన సర్వీసుల శాఖలపై అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ కిట్ల పంపిణి, క్రీడా స్టేడియాల నిర్మాణ పనులు, యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో నిర్వహించే ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్ నిర్వహణ , వివిధ జిల్లాలో జాబ్ మేళాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించడానికి ఏర్పాటు చేస్తున్న టూరిజం ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ టూరిజంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సుమారు 17,600 గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీకి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.