Minister Satyavathi | సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే సర్పంచులుగా అవకాశం దక్కిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామిర్‌పేటలో జరిగిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇవాళ అనేక గిరిజన గురుకుల పాఠశాలలు వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంది గిరిజన బిడ్డలు ప్రజా ప్రతినిధులుగా ఉన్నామంటే కేసీఆర్ భిక్షనేనన్నారు. తండాలు గ్రామ పంచాయతీలు కావడంతో ఇవాళ ఇంత మంది సర్పంచులుగా అవకాశం వచ్చిందన్నారు.
గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు కట్టించారని, గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కావాలంటే.. సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇందులో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఎంతో కృషి ఉందన్నారు. 4.5లక్షల ఎకరాల పోడు భూములకు ఒక్కసారి పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఐదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయలేదన్నారు. మనను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.
గిరిజనులను జాగృతం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని.. అడిగింది ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ మరో పదేళ్లు అధికారంలో ఉంటే లాభం జరుగుతుందన్నారు. లాంబాడాలకు షేరు సారా పోస్తే ఓట్లు వేస్తారని మనల్ని అవహేళన చేసి మాట్లాడిన వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రూ.4వేల కోట్లతో ప్రతి తండాకు రోడ్లు వేసుకున్నామని, కొమ్రుంభీం, సేవాలాల్ జయంతి, వర్ధంతిని అధికారికంగా జరిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించలేదని.. గిరిజన యూనివర్సిటీని బీజేపీ ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. అందరం మరొక్క సారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.