మహబూబాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ మతవిద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బీజేపీ మతాన్ని, కాంగ్రెస్ కులాన్ని వాడుకొంటూ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం మహబూబాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీజేపీ పాలన లో విసిగిపోయిన దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వంటి సమర్థుడైన నాయకుడు కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు.
దేశ సంపదను కొద్దిమంది బడాబాబులకు దోచిపెడుతున్న ప్రధాని మోదీకి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారన్నారు. గిరిజన రిజర్వేషన్ పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచడం లేదని, ఇక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు రిజర్వేషన్లపై గిరిజనులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మతపరమైన అలజడి సృష్టించే పార్టీలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని హెచ్చరించా రు. త్వరలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నూరేండ్లు నిండిపోవడంతో ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని అన్ని వర్గాల వారు హర్షిస్తున్నారని మంత్రి తెలిపారు.