మహబూబాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress)కి ఓటేస్తే పోయిందనుకున్న దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకున్నట్టే. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం అని పార్టీ నేతలు కోతలు కోస్తున్నారని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Sathyawathi) అన్నారు. శుక్రవారం జిల్లాలోని రెడ్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్(Shankar nayak) గెలుపు కోరుతూ మంత్రి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మి మాదిరిగానే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న13.5 లక్షల మంది ఆడ బిడ్డలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 ఏండ్ల వయసు నిండిన అర్హురాలైన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ అందిస్తామన్నారు. పేదోడికి సన్న బువ్వతో కడుపు నిండా భోజనం పెట్టడమే లక్ష్యంగా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో 93 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారని ఆమె తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఐదు నెలలకే ఆ పార్టీ పాలన చేతులెత్తేసే పరిస్థితి నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మొద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రజలను కడుపుల పెట్టుకొని చుసుకుంటున్న కేసీఆర్ పాలన కావాలా? లేక ప్రజలను ఇబ్బంది పెట్టే ఢిల్లీ కాంగ్రెస్, బీజేపీ పాలన కావాలో ప్రజలే ఆలోచించి కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.