మహబూబాబాద్, నవంబరు 16 : ఎన్నికల్లో ప్రజలను మోసగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని నమ్మొద్దని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్(Minister Sathyavathi Rathord) అన్నారు. గురువారం మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్‌కు(MLA Shankar nayak) ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెడుతూ ఓట్ల కోసం అన్ని పార్టీలు వస్తాయని, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారిని ఆదరించాలన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ 45 సంవత్సరాలు పాలించి అధోగతి పాలు చేసిందని విమర్శించారు. తెలంగాణను ఉద్యమ స్ఫూర్తితో సాధించిన రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
మాయమాటలు, వారంటీ లేని ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ర్టాన్ని 9 ఏళ్లలో ప్రగతిపథాన నడిపించి దేశంలోనే తెలంగాణను ప్రథమంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వివరించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుపడుతుందో ఆ పార్టీకి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
గడిచిన తొమ్మిదేళ్లలో మానుకోటను అభివృద్ధి చేసిన బానోత్ శంకర్‌నాయక్‌ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ యాళ్ల పుష్పలతారెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్, కోండ్ర ఎల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.